Cm Revanth: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ తెలంగాణకు చీకటి రోజు అని.. ఇది 4కోట్ల మంది ప్రజలకు జరిగిన అవమానం అని అన్నారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాత మధు సభ్యత్వం బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై సభలో మాట్లాడారు సీఎం రేవంత్. ఎమ్మెల్సీ మధు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సభా సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హితవు పలికారు. సభలో ముఖ్యమంత్రి అయినా, శాసనసభ్యుడైనా స్పీకర్ కు సమానమే అని చెప్పారు. అలాంటి స్పీకర్ మనసు గాయపడేలా బీఆర్ఎస్ వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ఇది వ్యక్తిగా గడ్డం ప్రసాద్ కుమార్ కి జరిగిన అవమానం కాదని, సభ్య సమాజానికి జరిగిన అవమానం అని రేవంత్ అన్నారు.
సభ్య సమాజం తలవంచుకునేలా
స్పీకర్ పదవి ఒక అత్యున్నత స్థానం, సభాపతిని గౌరవించడం మన సంప్రదాయం, అలాంటి స్పీకర్ పై సభ్య సమాజం తలవంచుకునేలా కొంతమంది మాట్లాడారని ముఖ్యమంత్రి రేవంత్ విరుచుకుపడ్డారు. ఇది సభకు జరిగిన అవమానంగా భావించి సభ్యులు దీనిపై చర్చ పెట్టారని తెలిపారు. ఇది సభ గౌరవానికి సంబంధించిన విషయం అని, భవిష్యత్ తరాలు మన నుంచి నేర్చుకునేలా మన వ్యవహార శైలి ఉండాలని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
క్షమించరాని నేరం
తెలంగాణకు ఇదొక చీకటి రోజు అని, ఇది 4కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం అని, ఇంత అనుచిత భాషతో దూషించడం క్షమించరాని నేరం అని సీఎం రేవంత్ అన్నారు. సభాపతిని, ఆయన కుటుంబసభ్యులను అవమానించేలా మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై మండిపడ్డారు. ఇది కేవలం దళితులకు జరిగిన అవమానం కాదు.. ఇది అందరికీ జరిగిన అవమానని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ దళిత వ్యతిరేకి
''తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని నమ్మించారు. దళితులకు మూడెకరాలు ఇస్తానని నమ్మించారు. దళిత బంధు ఇస్తామని నమ్మించారు. చివరికి దళిత ఉప ముఖ్యమంత్రిని భర్తరఫ్ చేశారు. నేరెళ్లలో ఇసుక లారీలను అడ్డుకున్న దళితులను లారీలతో తొక్కించి చంపారు. ఒక దళితుడిని కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడిని చేస్తే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రతిపక్ష హోదా నుంచి తొలగించారు. బీఆర్ఎస్ ది దళిత వ్యతిరేక ఆలోచన, దళిత వ్యతిరేక వైఖరి.
కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
స్పీకర్ తల్లిని అవమానించేలా మాట్లాడటం మా అందరికీ జరిగిన అవమానంగా భావిస్తున్నాం. మనందరం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా మనం వ్యవహరించాలి. ఇలాంటి దుర్మార్గపు పోకడలను నియంత్రించాలి. ప్రభుత్వం సంయమనం పాటిస్తే ఆది చేతకానితనం అనుకుంటున్నారు. అదిరించి, బెదిరించి వ్యవస్థలను లొంగదీసుకుంటామంటే చూస్తూ ఊరుకోం. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. క్షమాపణ చెప్పి ఆ సభ్యుడితో రాజీనామా చేయించాలి. అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడి సభ్యత్వం బర్తరఫ్ చేయాలి'' అని సీఎం రేవంత్ కోరారు.
''శాసనసభలో చర్చలు జరిగాక నిర్ణయాలు జరుగుతాయి. బీజేపీ లేవనెత్తిన అంశాలపై కూలంకషంగా చర్చ జరిగాక సభ నిర్ణయం తీసుకుంటుంది. చర్చ జరగకుండా నిర్ణయం తీసుకోమనడం వారి చీకటి మిత్రులను కాపాడాలనే ప్రయత్నమే. ఇదే సభలో కాళేశ్వరంపై చర్చించి విచారణకు ఆదేశించాం'' అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.












