సీజన్ క్లైమాక్స్‌లో భారీ వర్షాలు!
తెలంగాణకు ఇదే లాస్ట్ ఛాన్స్
సెప్టెంబర్ 13–17 మధ్య భారీ వర్షాలు
ఇప్పటికీ 21 శాతం వర్షపాతం లోటు..
20 జిల్లాల్లో కరువు ఛాయలు
తెలంగాణకు ఇదే లాస్ట్ ఛాన్స్. రుతుపవనాలు తిరోగమించే వేళ.. భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూస్తుంటే.. ఆశలు చిగురిస్తున్నాయి. సెప్టెంబర్ రెండో వారంలో వాతావరణం ఒక్కసారిగా యాక్టివ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అంచనాలను ఐఎండీ సహా పలు ప్రైవేట్ ఏజెన్సీలు విడుదల చేస్తున్నాయి.
తెలంగాణకు.. ఈ వర్షాలు చాలా కీలకం. సాధారణంగా సెప్టెంబర్‌తో నైరుతి రుతుపవనాల సీజన్ చివరి దశకు చేరుకుంటుంది. ఆ తర్వాత క్రమంగా రుతుపవనాల తిరోగమనం మొదలవుతుంది. అంటే.. ఇప్పుడొచ్చే ప్రతి వర్షపు చుక్కకూ విలువ ఉంది. సెప్టెంబర్‌లో మంచి వర్షాలు పడితే ఇప్పటివరకు ఉన్న లోటును కొంతైనా పూడ్చుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే.. ఈ సీజన్‌లో భారీగా లోటు మిగిలిపోయే ప్రమాదం ఉంది.
21 శాతం లోటు.. 20 జిల్లాల్లో ఇదే పరిస్థితి!
తెలంగాణలో ఇప్పటివరకు వర్షాల పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. IMD హైదరాబాద్ తాజా గణాంకాల ప్రకారం జూన్ 1 నుంచి సెప్టెంబర్ 2 వరకు రాష్ట్రంలో 463.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇదే సమయంలో సాధారణ వర్షపాతం 587.2 మి.మీ. ఉండాలి. అంటే 123.8 మి.మీ. తక్కువగా నమోదైంది. మొత్తంగా రాష్ట్రంలో 21 శాతం లోటు ఉంది.
ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. తెలంగాణలోని 33 జిల్లాల్లో 20 జిల్లాలు లోటు వర్షపాతం ఎదుర్కొంటున్నాయి. కేవలం 12 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఒక్క జిల్లాలో మాత్రమే అధిక వర్షపాతం నమోదైంది. అంటే.. రాష్ట్రంలో వర్షాలు పడుతున్నప్పటికీ అవి అన్ని ప్రాంతాల్లో సమానంగా పడటం లేదు. కొన్ని చోట్ల భారీ వర్షాలు.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు వస్తే.. అదే బిగ్ ఛాన్స్!
ఇలాంటి సమయంలోనే సెప్టెంబర్ 13–17 మధ్య వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉందన్న అంచనాలు ఆశ కలిగిస్తున్నాయి. రెండు వాతావరణ సర్క్యులేషన్లు, వాటికి అనుకూలంగా ఏర్పడే షియర్ జోన్ కలిసి వర్షాలకు అనుకూల పరిస్థితులను సృష్టించే అవకాశం ఉందని వాతావరణ మోడళ్లు సూచిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ వ్యవస్థ తెలంగాణ పరిసరాల్లోనే బలపడితే.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు వర్షాలు విస్తరించే అవకాశం ఉంటుంది. అందుకే ఈసారి ఒక్క హైదరాబాద్‌కే పరిమితమైన వర్షాలు కాకుండా పాన్ తెలంగాణ వర్షాలపై ఆశలు పెట్టుకోవచ్చు. అయితే ఇది ఇప్పటికీ మోడల్ ఆధారిత అంచనా మాత్రమే. తేదీ దగ్గరపడే కొద్దీ వ్యవస్థ బలం, కదలిక, వర్షాల తీవ్రతపై స్పష్టత పెరుగుతుంది.
సెప్టెంబర్ 10 నుంచే సీన్ మారుతుందా?
ప్రస్తుతం తెలంగాణ మొత్తం ఎండలు దంచికొడుతున్నాయి. ఏదో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు పడుతున్నాయి. ఐతే తాజా అంచనాల ప్రకారం సెప్టెంబర్ 10, 11 నుంచే తెలంగాణలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాల యాక్టివిటీ క్రమంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
IMD హైదరాబాద్ తాజా బులెటిన్‌లో కూడా సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఏడు రోజులకు భారీ వర్ష హెచ్చరికలు మాత్రం జారీ కాలేదు. అంటే.. ఇప్పటి నుంచి వాతావరణం యాక్టివ్ అవుతూ.. సెప్టెంబర్ 13 తర్వాత మరింత బలపడుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి.
హైదరాబాద్‌కు కూడా గుడ్‌న్యూస్!
హైదరాబాద్ వాసులకు కూడా ఇది కీలకమైన సమయం. నగరంలో సాధారణంగా సెప్టెంబర్‌లో ఒక్కసారిగా ఏర్పడే థండర్‌స్టార్మ్స్ భారీ వర్షాలకు దారితీస్తుంటాయి. ఈసారి తెలంగాణలోనే వాతావరణ వ్యవస్థ బలపడితే.. హైదరాబాద్‌పై కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా కురిసే భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాల్లో నీటిముంపు.. ట్రాఫిక్ ఇబ్బందులు.. ఉరుములు, పిడుగులు వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇదే టైమ్‌లో గణేష్ నవరాత్రులు కూడా ఉండడంతో.. కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. అయినా అంతిమంగా వర్షాలు కురిస్తే అందరికీ ఆనందమే.
రుతుపవనాలకు చివరి అంకం.. ఇదే చివరి ఛాన్స్?
నైరుతి రుతుపవనాల సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో.. తెలంగాణలో మిగిలిన వర్షపాత లోటును తగ్గించుకోవడానికి సెప్టెంబర్ వర్షాలు చాలా కీలకం. ఇప్పటికే రాష్ట్రంలో 21 శాతం లోటు ఉంది. సెప్టెంబర్‌లో కూడా వర్షాలు బలహీనంగా ఉంటే.. ఆ లోటును పూడ్చుకోవడం కష్టమవుతుంది.
పైగా IMD కూడా సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. అందుకే ఇప్పుడు తెలంగాణ చూపంతా ఆకాశంపైనే. సెప్టెంబర్ 10 నుంచి వర్షాల సందడి మొదలై.. 13 నుంచి 17 మధ్య భారీ వర్షాలు కురిస్తే.. ఈ సీజన్‌కు అది నిజంగానే ఒక పెద్ద ఊరట కావచ్చు. లేకపోతే? ఇక అంతే సంగతులు అనే పరిస్థితి రావచ్చు.












