విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
ఢిల్లీ హాస్టళ్లలో ఎన్ని దారుణాలో..?
చదువుకోవడానికి ఢిల్లీకి వస్తే.. సురక్షితమైన గది దొరకదా?
దేశ రాజధాని ఢిల్లీ.. దేశం నలుమూలల నుంచి వచ్చే విద్యార్థులకు ఒక కలల నగరం. మంచి చదువు.. మంచి కెరీర్.. మంచి భవిష్యత్తు కోసం వేలాది మంది యువత ఢిల్లీ యూనివర్సిటీ వైపు అడుగులు వేస్తారు. కానీ వాళ్లు అక్కడికి వెళ్లిన తర్వాత ఎదురయ్యే అసలు ప్రశ్న.. చదువుకోవడానికి వచ్చాం.. ఉండటానికి సురక్షితమైన చోటు ఎక్కడ? అనేదే. ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు సత్య నికేతన్ శిథిలాల మధ్య వెతకాల్సిన పరిస్థితి వచ్చింది.
సత్య నికేతన్‌లో ఐదు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ విద్యార్థుల కుటుంబాల్లో విషాదం నిండిపోయింది. అయితే దీనిని కేవలం ఓ భవనం కూలిన ఘటనగా చూడొద్దు. అసలు సమస్యను గుర్తించాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఆ శిథిలాల మధ్య నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు.. ఢిల్లీ విద్యార్థుల దారుణ పరిస్థితులు.
7 లక్షల మంది.. హాస్టల్ రూములు మాత్రం 8 వేలే!
ఢిల్లీ యూనివర్సిటీలో రెగ్యులర్, ప్రొఫెషనల్, ఓపెన్ లెర్నింగ్ కోర్సులు కలిపి 7 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. అయితే యూనివర్సిటీకి అందుబాటులో ఉన్న హాస్టల్ సామర్థ్యం మాత్రం వివిధ నివేదికల ప్రకారం సుమారు 7 వేల నుంచి 8 వేల గదులు మాత్రమే. అంటే లక్షల మంది విద్యార్థులకు వేల సంఖ్యలో మాత్రమే హాస్టల్ గదులు అందుబాటులో ఉన్నాయన్నమాట.
2024–25 విద్యా సంవత్సరంలో దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో నమోదు చేసుకున్నట్లు సమాచారం. 2025లో 30 వేలకు పైగా అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు హాస్టళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నా.. 10 శాతం కంటే తక్కువ మందికే సీటు దక్కినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే మిగిలిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? వాళ్లకు హాస్టల్ లేదు. తప్పనిసరిగా ప్రైవేట్ PGలు, హాస్టళ్లు, షేర్డ్ రూముల వైపు వెళ్లాల్సిందే. ఇక్కడి నుంచే అసలు సమస్య మొదలవుతోంది.
ప్రైవేట్ హాస్టల్ గది సురక్షితమా?
ఢిల్లీకి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థి ముందు ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఫీజులు, పుస్తకాలు, ప్రయాణం, ఆహారం.. వీటన్నింటికీ తోడు ఇంటికి దూరంగా ఉంటూ నెలనెలా అద్దె చెల్లించాలి. అందుకే చాలామంది తక్కువ ఖర్చులో దొరికే PGలను ఎంచుకుంటారు.
కానీ ఆ భవనం ఎప్పుడు నిర్మించారు? ఎన్ని అంతస్తులకు అనుమతి ఉంది? బిల్డింగ్ ప్లాన్ ఆమోదించారా? ఫైర్ సేఫ్టీ ఉందా? ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా? నిర్మాణం నిబంధనలకు అనుగుణంగా ఉందా? ఇలాంటి ప్రశ్నలు విద్యార్థి అడగకపోవచ్చు. అడిగినా.. వాటిని తనిఖీ చేసి నిర్ధారించాల్సిన బాధ్యత విద్యార్థిదేనా? చదువుకోవడానికి వచ్చిన విద్యార్థి.. ఇంజినీర్‌గా మారి భవనం బలం పరీక్షించాలా?ఇదే ఇప్పుడు దేశం ఆలోచించాల్సిన ప్రశ్న.
సత్య నికేతన్ విషాదం ఏం చెబుతోంది?
సత్య నికేతన్‌లో కూలిపోయిన దశాబ్దాల నాటి భవనంలో అబ్బాయిల PG నడుస్తోంది. మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలోనే భవనం కూలిపోయింది. ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలోని అన్ని PGలు, ప్రైవేట్ హాస్టళ్లను వారం రోజుల్లో ఆడిట్ చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీని ఆదేశించింది.
ఆ భవనానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా? నిబంధనలు పాటించారా? అధికారుల వైఫల్యం ఏమైనా ఉందా? ఉంటే బాధ్యులు ఎవరు? వారిపై ఏ చర్యలు తీసుకున్నారు? ఇవన్నీ విచారణలో తేల్చాలని కోర్టు స్పష్టం చేసింది. అంటే సమస్య కేవలం ఓ భవనం నాణ్యతకు సంబంధించినది కాదు. వ్యవస్థ మొత్తం ఎలా పనిచేస్తోంది? అన్నదానిపైనే ఇప్పుడు ప్రశ్నలు మొదలయ్యాయి.
2 అంతస్తులకు అనుమతి.. 5 అంతస్తులు ఎలా?
ఈ ఘటనలో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. MCD అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం.. సుమారు 55 చదరపు గజాల స్థలంలో ఉన్న ఈ నిర్మాణానికి గతంలో గ్రౌండ్ ప్లస్ వన్ వరకు మాత్రమే అనుమతి ఉండగా.. కూలిపోయిన భవనం మాత్రం గ్రౌండ్ ప్లస్ ఫోర్ నిర్మాణంగా ఉంది. బిల్డింగ్ ప్లాన్ కూడా ఆమోదం పొందలేదని అధికారులు తెలిపారు.
ఇది ఒక్క భవనం కథేనా? లేక ఢిల్లీలోని మరెన్నో ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు ఉన్నాయా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. అందుకే ప్రైవేట్ హాస్టళ్లు, PGలపై విస్తృత తనిఖీలకు ఆదేశాలు వచ్చాయి. ఎందుకంటే అనుమతులు ఒకటి.. నిర్మాణం మరొకటి అయితే.. చివరికి ప్రమాదం మాత్రం విద్యార్థుల ప్రాణాలకే.
ఐదుగురు అధికారులు సస్పెండ్.. యజమాని అరెస్ట్
భవనం కూలిన మరుసటి రోజే ఢిల్లీ సివిక్ బాడీ ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది. డిప్యూటీ కమిషనర్ నుంచి ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అధికారులపై వేటు పడింది. మరోవైపు భవనం యజమాని హరిరామ్ బన్సాల్‌ను రాజస్థాన్‌లోని భివాడీలో పోలీసులు అరెస్ట్ చేశారు.
చర్యలు మొదలయ్యాయి. అధికారులు సస్పెండ్ అయ్యారు. భవనం యజమాని అరెస్టయ్యారు. కానీ అసలు ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. ఈ ఒక్క భవనంపై చర్యలు తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుందా?
అసలు పరిష్కారం ఎక్కడుంది?
ఢిల్లీ యూనివర్సిటీకి వచ్చే విద్యార్థుల సంఖ్యకు తగినంతగా హాస్టల్ సౌకర్యాలు లేకపోతే.. ప్రైవేట్ PGలపై ఆధారపడటం తప్పనిసరి అవుతుంది. అప్పుడు ఆ PGల భద్రతను ఎవరు నిర్ధారించాలి? ప్రతి విద్యార్థి చేరే ముందు భవనం అనుమతులు వెతకాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి? ప్రతి తల్లిదండ్రి తమ పిల్లాడు ఉండే భవనం నిజంగా సురక్షితమేనా అని భయపడాల్సిన అవసరం ఎందుకు రావాలి?
విద్యార్థి ఢిల్లీకి వచ్చేది భవనాల మధ్య బతకడానికి కాదు.. భవిష్యత్తును నిర్మించుకోవడానికి. కానీ హాస్టల్ కొరత కారణంగా ప్రైవేట్ వసతులే మార్గమైతే.. ఆ వసతులు కనీస భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత కాదా?
ఇది సత్య నికేతన్ కథ మాత్రమే కాదు..
ఈ విషాదాన్ని ఒక ప్రాంతానికి పరిమితం చేస్తే అసలు సమస్యను చిన్నదిగా చేసినట్టే. సత్య నికేతన్‌లో కూలింది ఒక భవనం. కానీ దాని శిథిలాల మధ్య బయటపడింది విద్యార్థుల నివాస సమస్య, హాస్టళ్ల కొరత, అనధికార నిర్మాణాలు, అధికారుల పర్యవేక్షణ లోపాలు, ప్రైవేట్ PGలపై పెరుగుతున్న ఒత్తిడి.
ఏడుగురు ప్రాణాలు పోయిన తర్వాత వ్యవస్థ కదిలింది. కానీ రేపు మరో భవనం కూలిన తర్వాతే మరోసారి మేల్కొనకూడదు. ఎందుకంటే ఒక విద్యార్థి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తల్లిదండ్రులు చెప్పేది బాగా చదువుకో అని. నువ్వు ఉండే భవనం కూలిపోదు కదా అన్న అనుమానం వస్తే.. అంతకంటే దారుణమేమైనా ఉందా..?
అందుకే ఇప్పుడు ఢిల్లీ ముందు ఉన్న అతిపెద్ద ప్రశ్న ఇదే. 7 లక్షల మంది విద్యార్థులు ఉన్న నగరంలో.. 8 వేల హాస్టల్ రూములతో ఎంతమందిని సురక్షితంగా ఉంచగలం? మిగిలిన విద్యార్థుల భద్రతకు బాధ్యత ఎవరిది? సత్య నికేతన్ శిథిలాలు అడుగుతున్న ప్రశ్న ఇదే.











