తెలంగాణ

Telangana SIR 2026: లెక్క క్లియర్.. పట్నం కన్నా పుట్టిన ఊరే ముఖ్యమని కుండబద్దలు కొట్టిన తెలంగాణ ఓటర్లు

రచన: NK••6 నిమిషాల పఠనం

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) డిజిటలైజేషన్ (ఎన్యూమరేషన్) ప్రక్రియ పూర్తైంది. ఈ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం వివరాలు ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ప్రాథమికంగా లెక్క తేల్చారు. సేకరించిన సమాచారంలో ఇప్పటికి 2.64 కోట్ల ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేశామని, నమోదు ప్రక్రియ 78.30 శాతానికి చేరిందని ఎన్నికల అధికారులు తెలిపారు.

Telangana SIR 2026: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) డిజిటలైజేషన్ (ఎన్యూమరేషన్) ప్రక్రియ పూర్తైంది. ఈ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం వివరాలు ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ప్రాథమికంగా లెక్క తేల్చారు. సేకరించిన సమాచారంలో ఇప్పటికి 2.64 కోట్ల ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేశామని, నమోదు ప్రక్రియ 78.30 శాతానికి చేరిందని ఎన్నికల అధికారులు తెలిపారు.

''మొత్తం 3,38,26,448 ఓటర్లలో 2,64,87,214 మంది ఓట్లు డిజిటలైజ్ అయ్యాయి. 73 లక్షల 39 వేల 234 ఎన్యూమరేషన్ ఫారాలను వేర్వేరు కారణాలతో సేకరించలేకపోయాము. ఇందులో మరణించిన వారి సంఖ్య 9,22,230. అడ్రస్ దొరక్క అందుబాటులో లేని వారి సంఖ్య 11,25,546. తమ నివాస ప్రాంతాల నుంచి శాశ్వతంగా వలస వెళ్లిన వారి సంఖ్య 45,18,961. ఇక 6,70,203 మంది వేర్వేరు ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఇతర కారణాల వల్ల 1,02,294 మంది నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు'' అని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

పట్నం వద్దు పుట్టిన ఊరే ముద్దు..

ఓవరాల్ గా చూస్తే.. పట్నం వద్దు పుట్టిన ఊరే ముద్దు అని తెలంగాణ ఓటర్లు కుండబద్దలు కొట్టారు. పట్నం కన్నా పుట్టిన ఊరే మాకు ముఖ్యం అని తేల్చారు. ఉపాధి నిమిత్తం ఇతర జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో స్థిరపడ్డ వారంతా సొంతూళ్లకే జైకొట్టారు. నగరాన్ని కాదని ఓటర్లు తమ ఓటును సొంతూళ్లలోనే నమోదు చేసుకున్నారు. దీంతో గ్రామీణ జిల్లాల్లో ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ ఫుల్ అయ్యింది. పట్నంతో పోలిస్తే గ్రామీణ జిల్లాల్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ డిజిటలైజేషన్ 80 శాతం నుంచి 90 శాతానికి పైగా పూర్తవటం విశేషం.

హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలో మాత్రం డిజిటలైజేషన్ సగం మాత్రమే జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రక్రియలో హైదరాబాద్‌ చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. ఓటర్లు ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ వందశాతం పూర్తి చేసినా డిజిటైజేషన్‌ మాత్రం 60 శాతానికి కూడా చేరుకోలేకపోయింది. గడువు ముగిసేసరికి డిజిటైజేషన్‌ కేవలం 58.89 శాతం మాత్రమే పూర్తయింది. నగరంలోని 41 శాతానికి పైగా ఓటర్లు తమ స్వగ్రామాల్లోనే ఓటు నమోదు చేసుకున్నట్లు అధికారిక లెక్కల ద్వారా స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో సగం కంటే ఎక్కువ డిజిటైజేషన్‌ జరగలేదు.

ఎన్నికల సంఘం అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం..

పట్నంలో డిజిటలైజేషన్ వివరాలు..

రంగారెడ్డి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 36,99,743 కాగా.. 24,10,850 మంది ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ అయ్యాయి. అంటే.. 65.16శాతం..

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 29,79,130 కాగా..19,05,832 మంది ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ అయ్యాయి. అంటే.. 63.97శాతం..

హైదరాబాద్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 47,36,669 కాగా..27,89,214 మంది ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ అయ్యాయి. అంటే.. 58.89శాతం..

పట్నంలో నివాసం ఉంటున్నా.. మనసు మాత్రం పుట్టిన ఊరిపైనే ఉంది. తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అసోం తమిళనాడు, కర్ణాటక ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్‌కు వలస వచ్చిన ఓటర్లలో అధిక శాతం మంది తమ ఓటరు నమోదును నగరానికి మార్చుకోవడానికి ఇష్టపడలేదు. బదులుగా తమ సొంత ఊళ్లలోనే ఉంచుకోవడానికి మొగ్గు చూపారు. తమ పేర్లను తమ సొంత ఊళ్లలోని ఓటర్ల జాబితాలోనే ఉంచుకోవాలని ఎంచుకున్నారు.

#Telangana SIR 2026#Voters#Hyderabad#Hometown#SIR#Enumeration#Digitisation#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి