* ఆగస్టు 15న సంగారెడ్డి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సీఎం రేవంత్ శ్రీకారం
* రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఏక కాలంలో కార్యక్రమాలు
* 1.06 కోట్ల కార్డులు..
* ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల ఉచిత సన్నబియ్యం
* 2025 జనవరి 26 నుంచి కొత్తగా 16.32 లక్షల ఆహార భద్రత కార్డులు
Smart Ration Cards: తెలంగాణలో ఆహార భద్రతకు ‘స్మార్ట్’ రూపం రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనుంది ప్రభుత్వం. స్వాతంత్ర్య దినోతవ్సం ఆగస్టు 15న సంగారెడ్డిలో కార్డుల పంపిణీ ప్రక్రియను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. అదే రోజు రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అటు ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,06,28,092 ఆహార భద్రత కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది లబ్ధిదారులు ఆహార భద్రత పరిధిలో ఉన్నారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అర్హుడైన ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్నబియ్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందిస్తోందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ప్రవేశంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యం, లబ్ధిదారుల సౌలభ్యం మరింత పెరుగుతాయని చెప్పారు.
ఏడాదిన్నరలో 16.32 లక్షల కొత్త కార్డులు..
2025 జనవరి 26 నుంచి ఇప్పటి వరకు 16,32,810 కొత్త ఆహార భద్రత కార్డులను జారీ చేసి వాటి ద్వారా 61,08,544 మంది లబ్ధిదారులకు ఆహార భద్రత కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. ఆగస్టు 2026 నాటికి రాష్ట్రంలో మొత్తం ఆహార భద్రత కార్డుల సంఖ్య 1.06 కోట్లకు చేరిందన్నారు. తెలంగాణలో ఆహార భద్రత కార్యక్రమం ఏ స్థాయిలో కొనసాగుతుందో చెప్పేందుకు ప్రభుత్వం చేస్తున్న వ్యయమే నిదర్శనమన్నారు. రేషన్ బియ్యం కోసం ఏటా సుమారు రూ.14 వేల కోట్లు, రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు మరో రూ.20 వేల కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు.
లబ్ధిదారుడికి ఇబ్బంది కలగొద్దు..
సంగారెడ్డి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్. లబ్ధిదారుల తరలింపు, సీటింగ్, భద్రత, కార్డుల పంపిణీతో పాటు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుగానే పకడ్బందీగా ప్రణాళిక చేయాలన్నారు. కార్యక్రమానికి సంబంధించిన మినిట్-టు-మినిట్ షెడ్యూల్ సిద్ధం చేసి నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.
వాస్తవ లబ్ధిదారులను గుర్తించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు అందించాలని మంత్రి చెప్పారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా కార్డుల పంపిణీలో లబ్ధిదారుల గుర్తింపును ధ్రువీకరించి, పూర్తి పారదర్శకతతో కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిగిలిన జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు పంపాలని, అవసరమైన వ్యయంపై ముందుగానే స్పష్టత ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు.
ప్రతి అర్హుడికీ ఆహార భద్రతే లక్ష్యం..
‘‘తెలంగాణలో 1.06 కోట్ల ఆహార భద్రత కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తున్నాం. ప్రతి అర్హుడికి నెలకు 6 కిలోల సన్న బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నాం. ఇంత భారీ సంక్షేమ కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా లబ్ధిదారుడి చెంతకు తీసుకెళ్లడమే స్మార్ట్ రేషన్ కార్డుల లక్ష్యం’’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ ఆహార భద్రత కార్యక్రమం విస్తృతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 1.06 కోట్ల కార్డులు, 3.43 కోట్ల లబ్ధిదారులు, ఉచిత సన్నబియ్యం వంటి కీలక అంశాలతో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాతో పాటు షార్ట్ వీడియోలు, రీల్స్ ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు.












