మనిషి తన జీవితంలో ఎంత ఎదిగిన, ఎక్కడికి వెళ్ళిన చివరికి తప్పించుకోలేనిది మరణం. అయితే మరణం అంటే అన్నీ ముగిసిపోవడమేనా? లేక మరో ప్రయాణానికి ఆరంభమా? అనే సందేహం కలుగుతుంది. ఈ క్రమంలో భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రాలు ఈ ప్రశ్నకు ఎంతో లోతైన సమాధానాన్ని ఇస్తాయి.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు.. మనిషి పాత బట్టలు విడిచిపెట్టి కొత్త బట్టలు ధరించినట్లే, ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచి మరో శరీరాన్ని స్వీకరిస్తుందని చెబుతుంది. అంటే శరీరానికి అంతం ఉన్నా.. ఆత్మకు అంతం లేదన్నది ఆధ్యాత్మిక భావన.. అయితే జీవాత్మ మరణ సమయంలో తన శరీరాన్ని విడిచిన తర్వాత, దాని తదుపరి ప్రయాణాన్ని నిర్ణయించేది కేవలం చివరి క్షణం మాత్రమే కాదని శాస్త్రాలు చెబుతున్నాయి.
జీవితాంతం మనిషి చేసిన కర్మలు, ఆలోచనలు, కోరికలు, సంస్కారాలు.. ఇవన్నీ ఆ ప్రయాణంపై ప్రభావం చూపుతాయని అంటున్నాయి. మరోవైపు గరుడ పురాణంలో మరణానంతర జీవి ప్రయాణం గురించి విపులంగా వివరించబడింది. చేసిన మంచి, చెడు కర్మలకు అనుగుణంగా అనుభవాలు ఎదురవుతాయని, ఆ తర్వాతి గతి, కర్మఫలంతో ముడిపడి ఉంటుందని చెబుతుంది. అయితే ఉపనిషత్తులు దీనికంటే మరింత లోతైన విషయాన్ని చెబుతాయి.
మనిషి అసలు స్వరూపం ఈ శరీరం కాదు.. ఆత్మ అని అంటున్నాయి. అందుకే ఆత్మకు జననం లేదు, మరణం లేదు. జనన మరణాలు శరీరానికే చెందిన మార్పులని పేర్కొంటున్నాయి. అందుకే ఆధ్యాత్మిక దృష్టిలో మరణం ఒక ముగింపు కాదు.. ఒక దశ నుంచి మరో దశకు జరిగే మార్పు అని వివరిస్తున్నాయి.. ఇక మనిషి జీవితంలో సంపాదించిన ధనం, హోదా, పేరు చివరికి ఇక్కడే మిగిలిపోతాయి.
కానీ మనం చేసిన కర్మలు, ఇతరుల జీవితాల్లో మిగిల్చిన మంచితనం, మనలో పెంచుకున్న జ్ఞానం.. ఇవే మన ప్రయాణానికి అసలు సంపద అని శాస్త్రాలు చెబుతాయి. అందుకే మరణం గురించి ఆలోచిస్తూ నిత్యం భయపడటం కంటే.. బతికున్నప్పుడే మన జీవితం ఎలా ఉండాలి? మన కర్మలు ఎలా ఉండాలి? మనసు ఎంత పవిత్రంగా ఉండాలి?
అనే విషయం పై ధ్యాస పెట్టాలని ఆధ్యాత్మిక శాస్త్రాలు మనకు వివరిస్తున్నాయి.. మరణం ఎప్పుడు వస్తుందో మన చేతుల్లో లేకపోవచ్చు. కానీ మరణం తర్వాత మన కర్మల రూపంలో ఏమి మిగులుతుందో.. అది మాత్రం మన చేతుల్లోనే ఉంది.
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












