వ్యాధుల బారిన పడే పేదలకు మొదట గుర్తుకు వచ్చేది సర్కారీ దవాఖాననే.. అలాంటి ప్రజలకు భరోసా ఇవ్వవలసిన ప్రభుత్వ ఆస్పత్రులు.. జనం పాలిట నరక కూపంగా మారుతున్నాయనే ఆరోపణలున్నాయి.. ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం వల్ల ఎందరో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే..
ప్రభుత్వ దవాఖానాల తీరు ఇదేనా? పేదలకు అందాల్సిన వైద్యం.. వారి ప్రాణాలకే ముప్పుగా మారుతోందా? ఖరీదైన ప్రైవేట్ వైద్యం భరించలేని పేదలు నమ్మకంతో ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తే.. వారిపట్ల నిర్లక్ష్యం జరిగిందన్న ఆరోపణలు వస్తే.. బాధ్యత ఎవరిది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి..
కోయంబత్తూర్‌లో ఓ తండ్రి చేసిన ఆరోపణలు ఇప్పుడు ప్రభుత్వ వైద్య వ్యవస్థపై తీవ్రమైన విమర్శలకు కారణం అవుతుంది.. ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తం ఎక్కించిన తర్వాత తన కుమార్తెకు హెచ్‌ఐవీ సోకిందని కోయంబత్తూర్ కాడాంపాడికి చెందిన ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ పవన్‌కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. తనకు కుమారుడు, కుమార్తె ఉన్నారని, 2018లో తన కుమార్తె అనారోగ్యానికి గురవగా తాము చేపించిన వైద్య పరీక్షలో రక్తహీనత ఉందని తెలిసినట్టు పేర్కొన్నారు.
ఈ క్రమంలో కోయంబత్తూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా రక్తం ఎక్కించారని, కొద్దినెలల తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురవగా అదే ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు వివరించారు. అక్కడ రక్తపరీక్షలు నిర్వహించగా తన కుమార్తెకు హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలిందని వాపోయాడు. అయితే తమ ఇంట్లో వారెవరికి హెచ్‌ఐవీ లేదని.. కానీ తమ కుమార్తెకు ఆ వ్యాధి ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం వల్ల తన బిడ్డ జీవితం ప్రమాదంలో పడిందని మండిపడ్డారు. ఆస్పత్రి సిబ్బందిపై పోలీసులకు పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రి పై విచారణ జరిపించాలని, కుమార్తెకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు రక్త మార్పిడిలో భద్రతా ప్రమాణాలు ఎంతవరకు పాటించారు? పర్యవేక్షణ ఎక్కడ విఫలమైంది? పేదల ప్రాణాలకు విలువ లేదా? అని తలెత్తే ఈ ప్రశ్నలకు సమగ్ర దర్యాప్తే సమాధానం చెప్పాలి!












