తెలంగాణ

BC Chairman Niranjan: 40 కులాలను కేంద్ర OBC జాబితాలో చేర్చండి- ప్రధాని మోదీకి బీసీ కమిషన్ చైర్మన్ విజ్ఞప్తి

రచన: NK••5 నిమిషాల పఠనం

తెలంగాణ రాష్ట్రానికి చెందిన 40 కులాలను కేంద్ర ఇతర వెనుకబడిన తరగతుల (OBC) జాబితాలో చేర్చేందుకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ ప్రధాని మోదీని మరోసారి కోరారు. ఈ అంశంపై ప్రధానికి లేఖ పంపారు. తెలంగాణకు చెందిన 40 కులాలను కేంద్ర OBC జాబితాలో చేర్చే అంశం చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని లేఖలో పేర్కొన్నారు.

BC Chairman Niranjan: తెలంగాణ రాష్ట్రానికి చెందిన 40 కులాలను కేంద్ర ఇతర వెనుకబడిన తరగతుల (OBC) జాబితాలో చేర్చేందుకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ ప్రధాని మోదీని మరోసారి కోరారు. ఈ అంశంపై ప్రధానికి లేఖ పంపారు. తెలంగాణకు చెందిన 40 కులాలను కేంద్ర OBC జాబితాలో చేర్చే అంశం చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా కులాల వారి సెన్సస్ 2027 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ అంశాన్ని త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని ఏప్రిల్ 13న ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఈ అంశంపై గతంలో సమర్పించిన వినతికి స్పందిస్తూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ తెలంగాణకు చెందిన 40 కులాల వివరాలను కోరింది. అందుకు అనుగుణంగా తెలంగాణ బీసీ కమిషన్ 18 జూలైన ఆయా 40 కులాల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అనంతరం ఆగస్టు 3న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ డైరెక్టర్ పంపిన లేఖలో, కేంద్ర OBC జాబితాలో కులాలను చేర్చడం లేదా తొలగించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342A నిబంధనల ప్రకారం జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ అంశం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్య అని నిరంజన్ తెలిపారు. సంబంధిత కులాల్లో కొన్ని 2008లోనే తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితాలో చేర్చబడ్డాయని, అయితే అప్పటి నుంచి మిగతా కులాలు కేంద్ర OBC జాబితాలో స్థానం కోసం ఎదురుచూస్తున్నాయని వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (NCBC) ఢిల్లీలో రెండు దఫాలుగా విచారణలు నిర్వహించిందని వివరించారు. మొదటి విచారణలు 22 డిసెంబర్ 2021 నుంచి 24 డిసెంబర్ 2021 వరకు, రెండవ విచారణ 5 సెప్టెంబర్ 2023న జరిగాయని పేర్కొన్నారు. అయినప్పటికీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 342A ప్రకారం ఈ అంశానికి ఇంకా తుది పరిష్కారం లభించలేదని తెలిపారు.

ఈ ఆలస్యం కారణంగా సంబంధిత 40 కులాలకు చెందిన ప్రజలు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో లభించే OBC అవకాశాలను కోల్పోతున్నారని నిరంజన్ వాపోయారు. కాబట్టి తెలంగాణకు చెందిన 40 కులాలను కేంద్ర OBC జాబితాలో చేర్చే ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ విజ్ఞప్తి చేశారు. సంబంధిత వర్గాలకు సామాజిక న్యాయం, వారికి లభించాల్సిన అవకాశాలు అందేలా ఈ అంశాన్ని అత్యవసరంగా పరిష్కరించాలని విన్నవించారు.

#BC Chairman Niranjan#Telangana#Central Other Backward Classes#Pm Modi#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి