KBR Park: హైదరాబాద్ నగర వాసులకు బిగ్ అలర్ట్. నగరంలోని అత్యంత కీలకమైన కేబీఆర్ పార్కు చుట్టూ కొత్త ట్రాఫిక్స్ రూల్స్ అమలు కానున్నాయి. పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. ఈ నెల 18వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఈ ప్రత్యేక వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వస్తుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పార్కు చుట్టూ అండర్ పాస్‌ల నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వన్ వే కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా రోడ్ల వెడల్పు తగ్గి వాహనాల రాకపోకలపై ప్రభావం పడుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ జామ్‌లు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే విధానం అమలు చేయాలని ట్రాఫిక్ శాఖ నిర్ణయం తీసుకుంది.
హెచ్-సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లోని 6 ప్రధాన జంక్షన్లలో మొత్తం 110 పిల్లర్లు నిర్మించనున్నారు. ఇప్పటికే కొన్ని పిల్లర్ల పనులు మొదలయ్యాయి. ఈ నిర్మాణాలు పూర్తవడానికి రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ వన్ వే ట్రాఫిక్ విధానం కొనసాగనుంది. ఈ కొత్త ట్రాఫిక్ విధానం వల్ల వాహనదారులకు అసౌకర్యం కలిగినప్పటికి.. ప్రాజెక్ట్ పూర్తయ్యాక ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రయాణ సమయం ఆదా అవుతుందని అధికారులు వివరించారు.
వన్ వే ట్రాఫిక్ విధానం అమలుకు ముందే పోలీసులు రెండు దశల్లో ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్స్ నిర్వహించారు. ట్రాఫిక్ ప్రవాహం, జంక్షన్ల వద్ద ఏర్పడే రద్దీ, లేన్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు. ట్రయల్స్‌లో వచ్చిన సూచనల ఆధారంగా రహదారులపై కొత్త లేన్ మార్కింగ్స్, ప్రత్యేక ట్రాఫిక్ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. అలాగే కీలక జంక్షన్స్ లో వాహనదారులకు మార్గనిర్దేశం చేసేలా ట్రాఫిక్ సిబ్బందిని పెట్టారు. వీరు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. వాహనదారులు తమ ప్రయాణాన్ని సులభంగా ప్లాన్ చేసుకునేందుకు వీలుగా గూగుల్ మ్యాప్స్, నావిగేషన్ రూట్స్ లో కొత్త ట్రాఫిక్ మార్గాలను అప్ డేట్ చేస్తున్నారు.
కొత్త వన్ వే విధానం అమల్లోకి వచ్చాక నిరంతరం ట్రాఫిక్ ను పరిశీలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, సీసీటీవీల ద్వారా 24 గంటలూ పర్యవేక్షణ ఉండనుంది. దీనికి తోడుగా డ్రోన్ల ద్వారా రియల్-టైమ్ పర్యవేక్షణ చేస్తూ ట్రాఫిక్ రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేసి అందుకు అనుగుణంగా వెంటనే మార్పులు చేస్తారు.
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఉన్న ప్రధాన ఆసుపత్రులను దృష్టిలో ఉంచుకుని అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజిన్ల వంటి అత్యవసర వాహనాల కోసం ప్రత్యేకంగా లేన్-2 కేటాయించామని.. వాటికి ఎలాంటి ఆటంకం కలిగించొద్దని ట్రాఫిక్ పోలీసులు కోరారు. వన్ వే రోడ్లలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ, మలుపుల దగ్గర వాహనాలను పార్క్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అలాగే కేబీఆర్ పార్క్‌కు వచ్చే సందర్శకులు నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లోనే తమ వాహనాలను నిలపాలని సూచించారు.
మొత్తంగా వన్ వే ట్రాఫిక్ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని వాహనదారులు తమ ప్రయాణాలను అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వన్ వే ట్రాఫిక్ విధానం అమలులో ప్రజలంతా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.













