Pocharam Srinivas Reddy: సీనియర్ నేత, ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ పై తిరుగుబాటు చేశారు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఇష్టం లేకపోయినా.. తప్పలేదని వాపోయారు. కేసీఆర్ వల్లే అభివృద్ధి జరిగిందని నేనే చెబుతున్నా అన్న పోచారం.. అన్నం పెట్టినోడిని మరవడం కష్టంగా ఉందన్నారు. కొన్ని రాజకీయ పరిణామాల వల్లే పార్టీ మారాల్సి వచ్చిందని ఆయన వివరించారు. నేను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నా, కాంగ్రెస్ జెండాను కాదని పోచారం అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులు భట్టి విక్రమార్కకు, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోలేదని పోచారం ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామని సీఎం రేవంత్ చెబితేనే పార్టీలో చేరానని పోచారం వెల్లడించారు. 6 నెలల్లో బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెబితేనే జాతీయ కండువా కప్పుకున్నానని పేర్కొననారు.
మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని పోచారం ఆరోపించారు. మంత్రులు పొంగులేటి, భట్టి.. సీఎం రేవంత్ మాటలు వినడం లేదన్నారు. మంత్రులు పట్టించుకోవడం లేదంట, నువ్వైనా నిధులు విడుదల చేయమని వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ చెబితే ఆయన కూడా పట్టించుకోలేదని పోచారం వాపోయారు. వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ చేయడం లేదన్నారు.
నవంబర్ లో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం నిర్వహిస్తే.. నేను నీకు అమ్ముడుపోయానా? నా ఎమ్మెల్యే పదవిని కొన్నావా? అని రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించానని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తెలిపారు. సీఎం రేవంత్, మంత్రులను ఉద్దేశించి పోచారం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపాయి. పార్టీ ఫిరాయింపుపై పోచారం కామెంట్స్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.












