తెలంగాణ

Komati Reddy: ప్రజలకు మాటిచ్చాం, గడువులోగా పూర్తవ్వాల్సిందే- ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సమీక్షలో మంత్రి కోమటి రెడ్డి

రచన: NK••8 నిమిషాల పఠనం

Komati Reddy: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతిపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బీ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిర్ణీత గడువులోగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కావాల్సిందేనని మంత్రి తేల్చి చెప్పారు.

* నిర్లక్ష్యాన్ని, పనుల్లో ఆలస్యాన్ని అస్సలు సహించేది లేదు

* ప్రజలకు మాట ఇచ్చాం... మాట ప్రకారం చేసి తీరాల్సిందే

* ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పూర్తి జవాబుదారిగా వ్యవహరిస్తుంది

* ఏళ్ల తరబడి అవస్థ పడుతున్న ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేద్దాం

* అధికారులు మనసు పెట్టి పని చేయండి

* మ్యాన్ పవర్ పెంచి.. మూడు షిఫ్టుల్లో పనులు చేయాలి..

* రాత్రి వేళల్లో 11 నుండి ఉదయం 6 గంటల వరకు నిరంతరాయంగా పనులు జరగాలి

* కారిడార్ కింద బిటి రోడ్డు పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయాల్సిందే

* అటు నారపల్లి (CPRI) వైపు నుండి, ఇటు ఉప్పల్ వైపు నుండి.. ఇరువైపుల లాంచింగ్ గడ్డర్లతో పనులు వేగం పెంచాలి

* ప్రతి 10 రోజులకు ఒకసారి నేను స్వయంగా క్షేత్రస్థాయి పనుల పురోగతి సమీక్షిస్తా..

* ప్రతి రోజు వర్క్ ప్రోగ్రెస్ చూపించాలి

* ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సమీక్షలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

* 300 మంది కార్మికులు రెండు షిఫ్టుల్లో పని చేస్తున్నారన్న అధికారులు, వర్క్ ఏజెన్సీ

* ప్రస్తుత పరిస్థితుల్లో రాత్రి పూట పనుల వల్ల మరింత సమయం పట్టే అవకాశం ఉందని విజ్ఞప్తి చేసిన నిర్మాణ సంస్థ

* 2026 అక్టోబర్ 31 నాటికి అందుబాటులోకి తెస్తామని డెడ్ లైన్ పెట్టుకున్నాం.. ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులు గురించి ఆలోచించాలన్న మంత్రి

* 2026లో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిందే.. అధికారులు, వర్క్ ఏజెన్సీ ఆ దిశగా పని చేయాలని స్పష్టం చేసిన మంత్రి

Komati Reddy: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతిపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బీ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిర్ణీత గడువులోగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కావాల్సిందేనని మంత్రి తేల్చి చెప్పారు. నిర్లక్ష్యాన్ని, పనుల్లో ఆలస్యాన్ని అస్సలు సహించేది లేదన్నారు. అటు వైపు నిత్యం ప్రయాణించే వారికి ఏళ్ల తరబడి నరకప్రాయంగా మారిందని, అందుకోసమే 2026 దసరా నాటికి పూర్తి చేస్తామని ప్రజలకు మాట ఇచ్చామని, మాట ప్రకారం చేసి తీరాల్సిందేనని సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.

సీఎం రేవంత్ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పూర్తి జవాబుదారిగా వ్యవహరిస్తుందన్నారు. ఏళ్ల తరబడి అవస్థ పడుతున్న ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సురక్షిత ప్రయాణం అందించేలా చేద్దామని, అందుకు అనుగుణంగా అధికారులు మనసు పెట్టాలని ప్రత్యేకంగా కోరారు మంత్రి. మ్యాన్ పవర్ పెంచి.. మూడు షిఫ్టుల్లో పనులు చేయాలన్నారు. రాత్రి వేళల్లో 11 నుండి ఉదయం 6గంటల వరకు నిరంతరాయంగా పనులు జరగాలని ఆదేశించారు. కారిడార్ కింద 6.25 కిమీ బీటీ రోడ్డు పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని తేల్చి చెప్పారు.

ప్రతి పది రోజులకు ఒకసారి తాను స్వయంగా క్షేత్రస్థాయి పనుల పురోగతి సమీక్షిస్తానని.. అందుకు తగ్గట్టుగా రోజువారీ వర్క్ ప్రోగ్రెస్ అధికారులు సమీక్షించాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో నడుస్తున్న పనులపై మంత్రి కూలంకషంగా చర్చించారు. సైట్ లోని కచ్చితమైన వాస్తవ పరిస్థితులు చెప్పాలని అధికారులు, వర్క్ ఏజెన్సీని అడిగారు మంత్రి. ప్రస్తుతం ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 60శాతం మేర పనులు పూర్తయ్యాయని మరో 40శాతం పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు వివరించారు. సైట్ లో సెగ్మెంట్ తయారు చేయటానికి నాలుగు బెడ్లు, నాలుగు గ్యాంట్రీస్ తో 300 మంది కార్మికులు రెండు షిఫ్టుల్లో పని చేస్తున్నారని మంత్రికి చెప్పారు.

అటు నారపల్లి (CPRI) వైపు నుండి, ఇటు ఉప్పల్ వైపు నుండి.. ఇరువైపుల లాంచింగ్ గడ్డర్లతో పనుల్లో వేగం పెంచాలని మంత్రి సూచించారు. ఉప్పల్ వైపు నుండి జరుగుతున్న పనుల పురోగతిని మంత్రి ఆరా తీశారు. ఇప్పటికే ఒక స్లాబ్ పూర్తయిందని, రెండో స్లాబ్ పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాత్రిపూట పనుల వల్ల, వర్షాల వల్ల నిర్మాణం పూర్తికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని నిర్మాణ సంస్థ సమీక్ష సందర్భంగా విజ్ఞప్తి చేసింది.

2026 అక్టోబర్ 31 నాటికి అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే డెడ్ లైన్ పెట్టుకున్నాం. ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులు గురించి ఆలోచించాలని మంత్రి అన్నారు. వర్క్ ఏజెన్సీ విజ్ఞప్తి పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో మరింత వేగం పెంచాలని, మ్యాన్ పవర్ పెంచి మూడు షిఫ్టుల్లో పని చేయాలని తెగేసి చెప్పారు. నెలకు ఆరు స్లాబుల చొప్పున పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ మంత్రికి తెలిపింది. దీనికి అనుసంధానంగా GHMC నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులపై ఆరా తీసిన మంత్రి GHMC అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు సమాంతరంగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. 2026లో ఎట్టి పరిస్థితుల్లో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిందేనన్నారు. ఆర్ అండ్ బీ అధికారులు, వర్క్ ఏజెన్సీ ఆ దిశగా పని చేయాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

#Komatireddy Venkat Reddy#Telangana#Uppal-Narapally Elevated Corridor#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి