Polymer Banknotes: దేశంలో ప్లాస్టిక్/పాలిమర్ కరెన్సీ నోట్లు తీసుకొచ్చే అంశానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ నోట్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదన మేరకు ప్లాస్టిక్ నోట్ల ముద్రణకు ఆమోదం తెలిపింది. తొలుత ప్రయోగాత్మక పరిశీలన కోసం అత్యధికంగా చెలామణిలో ఉన్న, తక్కువ విలువ కలిగిన 10 రూపాయలు, 20 రూపాయల నోట్ల ముద్రణకు కేంద్రం ఓకే చెప్పింది.
తొలుత 100 కోట్ల చొప్పున 10, 20 నోట్ల ముద్రణ
ముందుగా 100 కోట్ల చొప్పున రూ.10, రూ.20 విలువైన పాలిమర్ నోట్లను మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన విజయవంతంగా పూర్తయ్యాక ఈ రెండు విలువల్లోని పాలిమర్ నోట్లను సాధారణంగా జారీ చేయాలని కోరుతూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రభుత్వానికి ఒక ప్రతిపాదనను పంపింది. కాగా, 2027 ఏప్రిల్ నుంచి ప్లాస్టిక్ నోట్లను అందుబాటులోకి తెస్తామని ఇటీవలే ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పిన సంగతి తెలిసిందే.
"కాగితంతో తయారయ్యే నోట్లతో పాటు పాలిమర్ నోట్లను కూడా జారీ చేయాలని RBI ప్రతిపాదించింది. వీటి సేకరణ ప్రక్రియ ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉందని తెలియజేసింది. అందువల్ల, పాలిమర్ నోట్ల ప్రవేశానికి సంబంధించిన కచ్చితమైన సమయాన్ని లేదా వాటి కోసం అయ్యే ఖర్చును ప్రస్తుత దశలో అంచనా వేయడం ఆచరణ సాధ్యం కాదు'' అని అధికారవర్గాలు తెలిపాయి.
మన్నిక ఎక్కువ, నకిలీ నోట్లకు చెక్..
రూ.10, రూ.20 వంటి చిన్న నోట్లు ఎక్కువగా చేతులు మారుతూ ఉంటాయి. ఈ కారణంగా అవి త్వరగా పాడైపోతుంటాయి. ఇది పెద్ద సమస్యగా మారింది. కాగితం స్థానంలో ప్లాస్టిక్ నోట్లు తెస్తే ఆ సమస్యకు పరిష్కారం దక్కినట్లు అవుతుంది. కాగితపు నోట్లతో పోల్చి చూస్తే ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మన్నికలో ఉంటాయి. అంతేకాదు నకిలీ నోట్ల ముప్పును కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చని భావిస్తున్నారు.
మార్కెట్ లోకి కొత్త పాలిమర్ నోట్లు వచ్చినా.. పాత కాగితపు నోట్ల చెలామణి విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, అవి యథావిధిగా చెలామణి అవుతాయని ఆర్బీఐ అధికారులు స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, వియత్నాం వంటి అనేక దేశాలు ఇప్పటికే పాలిమర్ నోట్లను విజయవంతంగా వినియోగిస్తున్నాయి.












