National

Operation Alert: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఐఎస్ఐ విధ్వంస కుట్ర.. సరిహద్దుల్లో 'ఆపరేషన్ అలర్ట్'!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. వేడుకల సందర్భంగా భద్రతా బలగాల దృష్టి ప్రధాన నగరాలపై ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని, సరిహద్దులగుండా ఉగ్రవాదులను చొరబెట్టేందుకు యత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) పక్కా సమాచారం సేకరించింది.

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. వేడుకల సందర్భంగా భద్రతా బలగాల దృష్టి ప్రధాన నగరాలపై ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని, సరిహద్దులగుండా ఉగ్రవాదులను చొరబెట్టేందుకు యత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) పక్కా సమాచారం సేకరించింది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్, బలూచిస్థాన్‌లలో ఎదురవుతున్న అంతర్గత నిరసనల నుంచి తమ ప్రజల దృష్టిని మళ్లించేందుకే పాక్ ఈ విధ్వంసకర వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది.

ఈసారి ఐఎస్ఐ కేవలం జమ్మూ కాశ్మీర్ లేదా రాజధాని ఢిల్లీకే పరిమితం కాకుండా, భద్రతా సంస్థల దృష్టిని మళ్లించి 'టైర్-2' నగరాల్లో లేదా బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా దాడులకు తెగబడే అవకాశం ఉందని ఐబీ అధికారులు భావిస్తున్నారు. భద్రతా బలగాలు ఒక ప్రాంతంపైనే దృష్టి సారించేలా తప్పుడు హెచ్చరికలు సృష్టించి, తక్కువ భద్రత ఉండే వేరే నగరాలను లక్ష్యంగా చేసుకునే ఎత్తుగడను కూడా ఉగ్రవాదులు ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. ఈ సమాచారంతో కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలను అత్యంత అప్రమత్తం చేసింది.

ఉగ్ర ముప్పు హెచ్చరికల నేపథ్యంలో పాకిస్థాన్ పశ్చిమ సరిహద్దు పొడవునా సరిహద్దు భద్రతా దళం (BSF) 'ఆపరేషన్ అలర్ట్'ను రంగంలోకి దించింది. ఆగస్టు 10 నుంచి 17 వరకు వారం రోజుల పాటు సాగే ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్, నిఘా వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు. సరిహద్దుల్లో ఎలాంటి అసాధారణ కదలికలు జరగకుండా నిరంతర కాపలా కాస్తున్నారు.

మరోవైపు తూర్పు సరిహద్దుల్లో చొరబాట్లను అడ్డుకునేందుకు పశ్చిమ బెంగాల్‌లోని సున్నితమైన ప్రాంతాల్లో ఏకంగా 40 'సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో' (SIB) యూనిట్లను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ సరిహద్దు మార్గాల ద్వారా దేశంలోకి అక్రమంగా ప్రవేశించడం, ఆయుధాల స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలను శాశ్వత ప్రాతిపదికన అరికట్టడమే లక్ష్యంగా భద్రతా యంత్రాంగాన్ని సరిహద్దు జిల్లాల్లో కట్టుదిట్టం చేస్తున్నారు.

 

#IndependenceDay#ISIPlot#HighAlert#OperationAlert#BorderSecurity#BSFAlert
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి