పశ్చిమ బెంగాల్లో ఇటీవల నిర్వహించిన ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR)పై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ ప్రక్రియలో ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వ్యక్తులు దాఖలు చేసిన అప్పీళ్ల పరిష్కారంపై స్పందించిన సుప్రీంకోర్టు.. విచారణ సందర్భంగా ఎవరైతే పిటిషన్లు దాఖలు చేశారో వారి వివరాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం (ECI)ను న్యాయస్థానం ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. ఓటర్ల తొలగింపుపై వచ్చిన ఫిర్యాదులు, అప్పీళ్లను ఎంతమేర పరిష్కరించారో స్పష్టమైన సమాచారాన్ని నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అయితే, ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా తాము ఎంతో కాలంగా బెంగాల్లో నివసిస్తుండగా.. తమ ఓట్లు డిలీట్ చేశారని పలువురు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఏవిధంగా భారతీయ పౌరులుగా నిర్దారిస్తున్నారో చెప్పాలని ఈసీని కోరింది.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా స్పందించిన సుప్రీంకోర్టు.. ఎస్ఐఆర్‌లో ఓట్లు తొలగింపుపై వస్తున్న ఫిర్యాదులకు జవాబు చెప్పాలని ఈసీకి నోటీసులు జారీ చేసింది. కాగా, పశ్చిమ బెంగాల్‌లోని ప్రతి బ్లాక్‌లో 'ఎస్ఐఆర్ ట్రిబ్యునళ్లను' ఏర్పాటు చేయాలని, బాధితులు చేసుకున్న అప్పీళ్లను నిర్దేశిత వ్యవధిలో వేగంగా పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని అధీర్ రంజన్ తను దాఖలు పిటిషన్‌లో కోరారు.ప్రజాస్వామ్యంలో అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడేందుకు ఈ చర్యలు అత్యంత ఆవశ్యకమని అందులో పేర్కొనడం గమనార్హం.












