తమిళనాడు ముఖ్యమంత్రి, సూపర్‌స్టార్ విజయ్ రాజకీయాల్లో సాధించిన అపూర్వ విజయంపై ప్రముఖ నటుడు విశాల్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో అనేకమంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చి విఫలమైనప్పటికీ, విజయ్ మాత్రం తక్కువ సమయంలోనే సీఎం పీఠాన్ని ఎలా అధిరోహించగలిగారనే దానిపై ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను స్పష్టంగా పంచుకున్నారు.
సినిమా నటులందరూ రాజకీయాల్లో రాణించలేరని పేర్కొన్న విశాల్... గతంలో శివాజీ గణేశన్, కే భాగ్యరాజ్ వంటి దిగ్గజ నటులు సొంత పార్టీలు పెట్టినా విజయం సాధించలేకపోయారని గుర్తుచేశారు. అలాగే అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి వంటి భారతీయ చిత్రసీమకు చెందిన అగ్ర కథానాయకులకు విపరీతమైన ప్రజాదరణ ఉన్నప్పటికీ, వారు కూడా రాజకీయ రంగంలో అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోయారని వివరించారు.
విజయ్ సక్సెస్ వెనుక ఉన్న ప్రధాన కారణాన్ని వివరిస్తూ... పాత రాజకీయ నాయకుల పనితీరుతో విసిగిపోయిన ప్రజలు అత్యవసరంగా ఒక మార్పును కోరుకున్నారని, విజయ్ ఆ ఆశలకు ప్రత్యామ్నాయంగా నిలిచారని విశాల్ అభిప్రాయపడ్డారు. విజయ్ మాట్లాడే తీరు, సరికొత్త తరహా ప్రచారం ముఖ్యంగా తొలిసారి ఓటు వేసే యువతను, సామాన్య ప్రజలను విశేషంగా ఆకట్టుకుందని, అందుకే ప్రజలు ఆయనపై నమ్మకంతో గెలిపించారని పేర్కొన్నారు.
విజయ్ సీఎం అయిన తర్వాత తాను స్వయంగా వెళ్లి కలిశానని చెప్పిన విశాల్, ఆయన్ను కలవడానికి తాను ఎలాంటి పూలగుచ్ఛాలు తీసుకెళ్లలేదని తెలిపారు. పదవిలోకి వచ్చిన తర్వాత కూడా విజయ్‌లోని నిరాడంబరత మారలేదని, కేవలం ఆయన హోదా మాత్రమే మారిందని కొనియాడారు. ఒక నటుడిగా, నాయకుడిగా ఎదురయ్యే విమర్శలను సమర్థంగా ఎదుర్కోవడంలో విజయ్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు.












