* కార్మికుల ఉపాధికి రక్షణ కల్పించాలి
* పాత బోర్లకు ఉచిత రిజిస్ట్రేషన్, 300 అడుగుల వరకు తవ్వకాలకు అనుమతి ఇవ్వాలి
* రిగ్ వాహనాల వేధింపులు, సీజ్లు నిలిపివేయాలి
* తెలంగాణ రిగ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముస్కు అంజిరెడ్డి
Telangana: బోరుబావుల తవ్వకాల రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని నివారించి, ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు, డ్రైవర్లు, వ్యాపారుల ఉపాధిని కాపాడాలని తెలంగాణ రిగ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 259ను తక్షణమే సవరించి, ఆచరణ సాధ్యమైన నిబంధనలు అమలు చేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు ముస్కు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. బోరుబావుల తవ్వకాలపై విధించిన ఆంక్షల కారణంగా రిగ్ కార్మికులు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి పనిచేస్తున్న డ్రైవర్లు, వాల్వ్ కార్మికులు, నిర్మాణ రంగంపై ఆధారపడిన మేసన్లు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రంగం స్తంభిస్తే నిర్మాణ రంగంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
వేధింపులు, సీజ్లు ఆపాలి
రిగ్ కార్మికులు, డ్రైవర్లు, వాల్వ్ కార్మికులు, మేసన్లు, ఇతర రంగాలపై ఆధారపడిన వారి జీవనోపాధిని కాపాడాలని, సరైన అనుమతులు, పర్మిట్లు కలిగిన రిగ్ వాహనాలను అకారణంగా అడ్డుకోవడం, వేధించడం, సీజ్ చేయడం వంటి చర్యలను నిలిపివేయాలని కోరారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు.
పాత బోర్లకు ఉచిత రిజిస్ట్రేషన్.. 15 రోజుల్లో అనుమతులు
గతంలో తవ్విన బోరు బావులకు ఎలాంటి జరిమానాలు లేకుండా ఒకేసారి ఉచిత రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా అనుమతులు మంజూరు చేయాలన్నారు. గడువులోగా అనుమతి రాకపోతే డీమ్డ్ అప్రూవల్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఎండిపోయిన బోరు బావులకు తిరిగి తవ్వకాలు చేపట్టేందుకు కొత్త అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఆన్లైన్లో సమాచారం అందిస్తే సరిపోయేలా నిబంధనలు రూపొందించాలని, అలాగే 300 అడుగుల లోతు వరకు బోర్లు వేసేందుకు అనుమతులు కల్పించాలన్నారు.
కార్మికుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని విధానాలు రూపొందించాలి
భూగర్భ జలాల పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టే చర్యలకు రిగ్ ఓనర్లు పూర్తిస్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే పర్యావరణ పరిరక్షణతో పాటు కార్మికుల జీవనోపాధిని కూడా దృష్టిలో ఉంచుకుని విధానాలు రూపొందించాలన్నారు. జీవో నెంబర్ 259లో అవసరమైన మార్పులు చేసి, బోరుబావుల రంగాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.


