Tollywood: వరుస ఫ్లాపుల్లో ఉన్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డతో లెక్కల మాస్టారు సుకుమార్ ఓ సినిమాను చేస్తున్నాడు. తాజాగా, ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. దీంతో, క్రేజీ కాంబో..సిద్ధు జొన్నలగడ్డను సుకుమార్ నిలబెట్టగలడా..అంటూ ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చలు మొదలయ్యాయి. గుంటూరు టాకీస్ లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డకు ఇప్పుడు ఒక సాలీడ్ హిట్ చాలా అవసరం.
‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో.. ఆ తర్వాత మాత్రం అదే స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాడు. ‘జాక్’, ‘తెలుసు కదా’ సినిమాలు ఎన్నో అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందులేకపోవడంతో సిద్ధు తదుపరి సినిమాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు సిద్ధు సుకుమార్ రైటింగ్స్‌లో ఓ సినిమాను ప్రకటించటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
సుకుమార్, బన్నీ వాసు కాంబినేషన్‌లో సినిమా!
సిద్ధు జొన్నలగడ్డ కెరీర్‌లో ఇది 10వ సినిమా కావడం విశేషం. సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 నిర్మాత బన్నీ వాసు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కొత్త దర్శకుడు బాబీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. నవంబర్ 11న ఉదయం 9:30 గంటలకు సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్.
సుకుమార్ బ్రాండ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది?
దర్శకుడిగా సుకుమార్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కథల ఎంపిక, కొత్త దర్శకులను పరిచయం చేసే విధానం కూడా ప్రత్యేకమే. గతంలో ఆయన నిర్మాణంలో వచ్చిన ‘ఉప్పెన’తో బుచ్చిబాబు సానా దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘విరూపాక్ష’తో కార్తీక్ దండు కూడా దర్శకుడిగా సక్సెస్ అందుకున్నారు. అంతకముందు కుమారీ 21ఎఫ్ మూవీతో పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే తరహాలో తన దగ్గర పనిచేసిన బాబీని దర్శకుడిగా పరిచయం చేస్తూ సిద్ధుతో సినిమా చేస్తున్నారు. అగ్ర దర్శకనిర్మాతలున్న ఈ ప్రాజెక్ట్‌తో సిద్ధు మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కడం పక్కా అంటున్నారు.


