తెలంగాణ

Cm Revanth: ప్రజలకు పోలీసులే మొదటి నమ్మకం- సీఎం రేవంత్

6 నిమిషాల పఠనం

టెక్నాలజీ వాడుకుంటూ నేరాల నియంత్రణకు యువ అధికారులు పని చేయాలని కొత్త డీఎస్పీలకు సందేశం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు ఏ సమస్య వచ్చినా మొదట గుర్తుకొచ్చేది పోలీస్ అని చెప్పారు.

Cm Revanth: టెక్నాలజీ వాడుకుంటూ నేరాల నియంత్రణకు యువ అధికారులు పని చేయాలని కొత్త డీఎస్పీలకు సందేశం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు ఏ సమస్య వచ్చినా మొదట గుర్తుకొచ్చేది పోలీస్ అని చెప్పారు. పారదర్శక పోలీసింగ్ ద్వారా ప్రజల నమ్మకాన్ని సంపాదించాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) -2025 రెండో బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొన్నారు.

మీ నేపథ్యాన్ని మర్చిపోవద్దు

కొత్త డీఎస్పీలకు కీలక సూచనలు ఇచ్చారు. ఉద్యోగాలు సాధించిన వాళ్లు మీ నేపథ్యాన్ని మర్చిపోవద్దన్నారు. మీరు ఏ లక్ష్యంతో ఇక్కడికి వచ్చారో ఆ దిశగా ముందుకు సాగాలన్నారు. తెలంగాణ ఏ విధంగా ముందుకు సాగుతుందనేది మీ చేతుల్లోనే ఉందన్నారు సీఎం రేవంత్. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి మీ పనితీరే కీలకం అని స్పష్టం చేశారు.

UPSC తరహాలో TGPSC

''2011లో ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 1 నియామకాలు జరిగాయి. మళ్లీ 13ఏళ్ల పాటు ఈ నియామక ప్రక్రియ ముందుకు సాగలేదు. గత ప్రభుత్వం టీజీపీఎస్‌సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది. యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను తీర్చిదిద్దాలని చర్యలు తీసుకున్నాం. అనుభవం, చిత్తశుద్ధి ఉన్న వారికి టీజీపీఎస్ సీ బోర్డులో స్థానం కల్పించాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గందరగోళం మీ అందరికీ తెలుసు. కొత్త డీఎస్పీల నియామక ప్రక్రియ ఎంత సంక్లిష్టంగా సాగిందో మీకు తెలుసు.

గ్రూప్ 1 నియామక ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం

కొంతమంది పనిగట్టుకుని గ్రూప్ 1 నియామక ప్రక్రియపై రాద్ధాంతం చేశారు. తాము చేయని పని మేము చేశామని అడ్డుకునేందుకు యత్నించారు. అలాంటి ప్రయత్నాలు మమ్మల్ని ఎంతో ఆందోళనకు గురి చేశాయి. అందుకే ఈ అంశంపై న్యాయస్థానంలో బలంగా వాదనలు వినిపించాం. సుప్రీంకోర్టు కూడా గ్రూప్ 1 నియామక ప్రక్రియను సమర్థించింది'' అని సీఎం రేవంత్ అన్నారు.

''దాదాపు 13 సంవత్సరాలుగా తెలంగాణలో వేలాది మంది యువ అభ్యర్థులు గ్రూప్-1 సర్వీసులలో ప్రవేశించాలనే తమ కలను సాకారం చేసుకునే అవకాశం కోసం ఎదురుచూశారు. వారి ఆందోళనలను గుర్తించి, మా ప్రభుత్వం టీజీపీఎస్సీలో సమగ్ర సంస్కరణలు చేపట్టింది. నియామక ప్రక్రియలో పారదర్శకతను, విశ్వసనీయతను పునరుద్ధరించింది. ప్రతిభే మార్గదర్శక సూత్రంగా ఉండేలా చూసింది.

చట్టపరమైన సవాళ్లు ఎదురైనప్పటికీ, మేము 112 మంది డీఎస్పీల నియామకాన్ని విజయవంతంగా పూర్తి చేసి, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక అధ్యాయానికి ముగింపు పలికాము. కొత్తగా నియమితులైన ప్రొబేషనరీ డీఎస్పీలతో మాట్లాడటం, శిక్షణ సమయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు పురస్కారాలు అందించడం నాకు దక్కిన గౌరవం.

ఈ యువ అధికారులు ప్రజాసేవలోకి అడుగుపెడుతున్న తరుణంలో.. యూనిఫాం అనేది కేవలం అధికారానికి చిహ్నం మాత్రమే కాదని, అది సమాజం పట్ల ఒక గంభీరమైన బాధ్యత అని నేను గుర్తు చేస్తున్నా. మీ నిరాడంబరమైన నేపథ్యాన్ని గుర్తుంచుకోవాలి. మీ ప్రయాణాన్ని తీర్చిదిద్దిన పోరాటాలను స్మరించుకోవాలి. మీ విధులను నిజాయితీ, నిష్పాక్షికత, కరుణతో నిర్వర్తించాలి. యువ అధికారులు ఆ నిబద్ధతకు మార్గదర్శకులుగా నిలవాలి. న్యాయం, భద్రత, ప్రజా విశ్వాసంతో కూడిన తెలంగాణ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని'' సీఎం రేవంత్ ఆశించారు.

#Cm Revanth#Telangana#DSP 2025#Hyderabad#Telangana Police#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి