KPHBలో ఎట్టకేలకు ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి 2.39 ఎకరాల భూమి విద్యాశాఖకు బదిలీ
కలెక్టర్ మనూ చౌదరికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ఇది ప్రజల విజయం అన్న ఎమ్మెల్యే
KPHB: హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ డివిజన్ రమ్యా గ్రౌండ్ వద్ద ప్రభుత్వ పాఠశాల నిర్మాణం కోసం గతంలో కేటాయించిన 2.39 ఎకరాల స్థలాన్ని ఎట్టకేలకు హౌసింగ్ బోర్డు నుంచి విద్యాశాఖకు బదిలీ చేయడం పట్ల కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ మనూ చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారాయన.
మూడేళ్ల క్రితమే పునాదులు
సుమారు మూడేళ్ల క్రితం రమ్యా గ్రౌండ్ వద్ద ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి చర్యలు చేపట్టి పాఠశాల పునాదులు కూడా వేయడం జరిగింది. అయితే ప్రభుత్వం మారడంతో హౌసింగ్ బోర్డ్ స్థలాలను అమ్మకాలకు పెట్టడంతో పాఠశాల నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో హౌసింగ్ బోర్డ్ స్థలాలు అమ్మొద్దంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రజా మద్దతుతో పోరాటం చేశారు. ముఖ్యంగా హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న 2.39 ఎకరాల స్థలాన్ని విద్యాశాఖకు బదిలీ చేయడంలో జాప్యం జరగడంతో పాఠశాల నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పలుమార్లు కలెక్టర్‌తో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులను కలిసి ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎంతో ఉపయోగపడే ప్రభుత్వ పాఠశాల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని నిరంతరం కృషి చేశారు. స్థానిక ప్రజలు, కాలనీ వాసులు సైతం ఈ అంశంపై తమ పోరాటాన్ని కొనసాగించారు.
త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించాలని విన్నపం
ఎట్టకేలకు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా, ప్రజల పోరాటం, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నిరంతర కృషి ఫలితంగా 2.39 ఎకరాల స్థలాన్ని హౌసింగ్ బోర్డు నుంచి విద్యాశాఖకు బదిలీ చేయడం జరిగింది. దీంతో ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. పాఠశాల నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించి, విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేలా చూడాలని, పాఠశాలను కూడా త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా కలెక్టర్ మనూ చౌదరిని కోరారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.
ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించి భూమి బదిలీ ప్రక్రియ పూర్తయ్యేలా సహకరించిన కలెక్టర్ మనూ చౌదరికి ఎమ్మెల్యే కృష్ణారావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ విషయంలో సహకరించిన ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు.
22ఏ భూ సమస్యలు పరిష్కరించాలని వినతి
అదే విధంగా నియోజకవర్గంలోని పలు కాలనీలకు సంబంధించిన భూములను 22ఏ నిబంధనల పరిధిలో ఉంచడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే. ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విద్యా రుణాలు పొందడంలో, ఇతర అవసరాలకు బ్యాంకు రుణాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆయా భూముల అంశాన్ని కూడా పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ను కోరారు.


