వివాహేతర సంబంధాల ముసుగులో కొందరు దారుణాలకు తెగబడుతున్నారు. చంపడానికి లేదా చావడానికైనా సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ వివాహిత ఆమె ప్రియుడితో కలిసి ఓ బాలుడిని దారుణంగా హత్యచేశారు. అనంతరం ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి జారుకునేందుకు ప్లాన్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వారి గుట్టు రట్టయింది. ఈఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకొరుకొండలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే..అపర్ణ అనే మహిళ భర్తతో విడిపోయి తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది.ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన అజయ్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.వీరిద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు రవి (15) అనే బాలుడు చూశాడు. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్తానని హెచ్చరించడంతో అతని హత్యకు అపర్ణ తన ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది.
ఈ నేపథ్యంలోనే గత నెల 24వ తేదీన మాయమాటలు చెప్పి బాలుడిని ఊరి బయటకు తీసుకెళ్లారు ఇద్దరు. అక్కడ కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి అతనితో తాగించారు.బాలుడు తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో గడ్డి మందు తాగాడని చెప్పి స్థానికుల సాయంతో గత నెల 25న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అనంతరం అక్కడి నుంచి అపర్ణ, ఆమె ప్రియుడు అజయ్ జారుకున్నారు. అయితే, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి రవి మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా అసలు విషయం వెలుగుచూసింది. వివాహేతర సంబంధం విషయం ఎక్కడ ఇంట్లో వారికి చెబుతాడని భయపడి తామే హత్య చేసినట్టు అపర్ణ అంగీకరించింది. దీంతో నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. బాలుడిని కోల్పోయిన బాధిత కుటుంబసభ్యులు నిందితులు ఇద్దరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


