ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కనీసం వాతావరణ సమాచారం కూడా అందని విపత్కర పరిస్థితుల్లో ఉపగ్రహాల సాయంతో ఆ లోటును భర్తీ చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన 12వ తరగతి విద్యార్థి ఆగమ్ జైన్ అద్భుత ఆవిష్కరణ చేశాడు. ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్‌వర్క్ కనెక్షన్ లేకుండానే వాతావరణ ఉపగ్రహాల నుంచి నేరుగా మేఘాలకు సంబంధించిన చిత్రాలను అందుకునే వినూత్న పరికరాన్ని రూపొందించి తన అసాధారణ ప్రతిభను చాటుకున్నాడు.
ఆగమ్ తాను రూపొందించిన ఈ పరికరానికి ‘సమ్మిట్‌సాథి’ (SummitSathi) అని నామకరణం చేశాడు. సాధారణంగా వాతావరణ వివరాలు తెలుసుకోవడానికి మొబైల్ నెట్‌వర్క్‌లు, ఇంటర్నెట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే హిమాలయాల వంటి మారుమూల పర్వత ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు లేదా వరదలు సంభవించినప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతింటాయి. ఇలాంటి అత్యవసర సమయాల్లో సమ్మిట్‌సాథి ద్వారా ఎలాంటి నెట్‌వర్క్ ప్రమేయం లేకుండా ఉపగ్రహ చిత్రాలను పొందవచ్చని ఆయన స్పష్టం చేశాడు.
ఈ సాంకేతికతను ప్రాథమికంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని సెరాజ్ లోయ పరిధిలో ఉన్న పది గ్రామాలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రాజెక్టు బృందం ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా మూడు రిసీవర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, వాటిని నిర్వహించేందుకు గాను ముగ్గురు స్థానికులకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఒక్కో పరికరం తయారీకి సుమారు రూ.68 వేలు ఖర్చు అవుతోంది.
అయితే ఈ పరికరం సేవలు ప్రభుత్వ వాతావరణ శాఖలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలు లేదా అత్యవసర సమాచారానికి ప్రత్యామ్నాయం కాదని ప్రాజెక్టు బృందం స్పష్టం చేసింది. ఇది ఆకస్మిక వర్షాలను ముందుగానే అంచనా వేయలేకపోయినా, ఉపగ్రహ చిత్రాల ద్వారా వాతావరణ పరిస్థితులను ప్రత్యక్షంగా అర్థం చేసుకునేందుకు ఒక అదనపు సమాచార వనరుగా మాత్రమే తోడ్పడుతుందని తెలిపింది. ఆ పాఠశాల విద్యార్థి ఆగమ్ జైన్ ఖగోళ శాస్త్రం, పర్యావరణ అధ్యయనాల్లోనూ స్వతంత్ర పరిశోధనలు కొనసాగిస్తుండటం విశేషం.


