ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజినోవా తమ 13ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని, తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని వారు కోరిన నేపథ్యంలో, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం (TDP), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అప్రమత్తమై కీలక నిర్ణయం తీసుకున్నాయి.
https://x.com/iTDP_Official/status/2119886664260792639?a=t5cWQ8diIS6ew9wWeCA&s=20
ఈ మేరకు రాజకీయాలకు అతీతంగా నాయకుల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయవద్దంటూ తమ పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా కార్యకర్తలకు రెండు పార్టీల అధిస్థానాలు స్పష్టమైన, కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశాయి. టీడీపీ సోషల్ మీడియా విభాగమైన ఐటీడీపీ (ITDP) స్పందిస్తూ, నాయకుల వ్యక్తిగత విషయాలపై అనుచిత పోస్టులు పెట్టడం, అసభ్యకర చర్చలు నిర్వహించడం వంటి చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్పడవద్దని స్పష్టం చేసింది.
పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు, వైసీపీ కూడా తమ నాయకులు, క్యాడర్, సోషల్ మీడియా విభాగానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని, ఇతరులు పెట్టే వివాదాస్పద పోస్టులను షేర్ చేయడం లేదా వాటికి స్పందించడం చేయకూడదని తేల్చిచెప్పింది.
https://x.com/JaganannaCNCTS/status/2120020132097413210?a=-6Lh_qI6FiQNc4_77CA&s=20
సాధారణంగా ఏ విషయానికైనా తీవ్రమైన రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకునే తెలుగుదేశం, వైఎస్సార్సీపీ పార్టీలు.. ఈ వ్యక్తిగత అంశంలో మాత్రం ఒకేలా స్పందించి తమ శ్రేణులకు సంయమనం పాటించాలని సూచించడం ప్రస్తుత రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ విభేదాలు ఏవైనా సతీసమేతంగా లేదా వ్యక్తిగతంగా ఎదుర్కొనే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గోప్యతను, మానవతా విలువలను గౌరవించాలనే ఆరోగ్యకరమైన సంప్రదాయానికి ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయి.


