దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, ఫిషింగ్ మోసాలు, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ టెలికాం శాఖ (DoT) అత్యంత సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించాలంటే, సదరు ఖాతాకు లింక్ అయిన యాక్టివ్ సిమ్ కార్డ్ (SIM Card) తప్పనిసరిగా అదే స్మార్ట్‌ఫోన్ పరికరంలో అమర్చి ఉండాలనే ‘సిమ్ బైండింగ్’ (SIM Binding) విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకువస్తోంది.
ఇప్పటివరకు ఫోన్‌లో సిమ్ లేకపోయినా కేవలం వైఫై (Wi-Fi) ఇంటర్నెట్ కనెక్షన్ ఆధారంగా వాట్సాప్ వాడే వెసులుబాటు ఉండగా, త్వరలోనే ఆ సౌకర్యానికి తెరపడనుంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం, కేవలం వాట్సాప్ (WhatsApp) మాత్రమే కాకుండా భారతీయ మొబైల్ నంబర్లతో నడిచే ప్రముఖ మెసేజింగ్ యాప్‌లన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది.
టెలిగ్రామ్ (Telegram), సిగ్నల్ (Signal), అరట్టై (Arattai), షేర్‌చాట్ (ShareChat), జోష్ (Josh), జియోచాట్ (JioChat) వంటి ప్రముఖ యాప్‌లలో మెసేజింగ్ సేవలు పొందాలంటే ఈ కొత్త 'సిమ్ బైండింగ్' విధానాన్ని అమలు చేయడం తప్పనిసరి చేశారు. కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు తమ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నంబర్‌కు సంబంధించిన సిమ్‌ను ఫోన్ నుంచి తొలగిస్తే, ఆ వెంటనే సదరు పరికరంలో మెసేజింగ్ సేవలు నిలిచిపోతాయి.
ఫోన్‌లో వేరే వైఫై కనెక్షన్ లేదా సెకండరీ సిమ్ ద్వారా ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నప్పటికీ, రిజిస్టర్ అయిన ప్రాథమిక సిమ్ కార్డ్ పరికరంలో ఉండటం తప్పనిసరి. అయితే డ్యూయల్ సిమ్ వాడే వినియోగదారులకు వారి ఖాతా నంబర్ యాక్టివ్‌గా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. విదేశాలకు ప్రయాణించే వినియోగదారులు భారతీయ సిమ్‌ను ఫోన్‌లోనే ఉంచి ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ లేదా సర్వీస్‌ను యాక్టివ్‌గా ఉంచుకుంటే వాట్సాప్ యథావిధిగా పనిచేస్తుంది.
ఈ సిమ్ బైండింగ్ సాంకేతికతను తమ యాప్‌లలో సమగ్రంగా విలీనం చేసేందుకు టెలికాం శాఖ సంబంధిత ప్లాట్‌ఫారమ్‌లకు డిసెంబర్ 31, 2026 వరకు గడువు నిర్దేశించింది. అనంతరం జనవరి 1, 2027 నుంచి ఈ నూతన సిమ్ బైండింగ్ నిబంధనలు దేశవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి రానున్నాయి. కాగా వాట్సాప్ వెబ్ (WhatsApp Web) వినియోగదారులకు సంబంధించి ప్రతి 6 గంటలకు ఆటోమేటిక్‌గా లాగౌట్ అయ్యే పాత ప్రతిపాదనను పక్కనబెట్టి, రిస్క్ నిర్వహణ (Risk-based logout) ఆధారంగా మాత్రమే లాగౌట్ ప్రక్రియ జరిగేలా సవరణ చేశారు.


