Harish Rao: తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి బాధాకరమని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబసభ్యులను హరీశ్ రావు పరామర్శించారు. లక్ష్మణ్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బీఆర్ఎస్ పార్టీ తరపున లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన లక్ష్మణ్ గౌడ్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు.
లక్ష్మణ్ గౌడ్ మృతి అత్యంత బాధాకరం..
''లక్ష్మణ్ గౌడ్ మృతి చాలా బాధాకరం. బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. అండగా ఉంటుంది. కారణాలు ఏవైనా మనిషి పోవడం చాలా దురదృష్టకరం. గతంలో లక్ష్మణ్ గౌడ్ తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోతే రాజేశ్వర్ రెడ్డి వచ్చి ఓదార్చి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. నిజంగా మా దృష్టికి వచ్చి ఉంటే తప్పకుండా లక్ష్మణ్ గౌడ్ ను కాపాడుకునే వాళ్ళం. తమ్ముడు ఎందుకో ధైర్యం కోల్పోయి మనస్థాపంతో ఈ రకంగా నిర్ణయం తీసుకున్నాడు. లక్ష్మణ్ గౌడ్ భార్యకి ఉద్యోగం ఇవ్వడంతో పాటు పిల్లలను చదివించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని రాజేశ్వర్ రెడ్డి చెప్పారు'' అని హరీశ్ రావు తెలిపారు.
లక్ష్మణ్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది
''జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి పరామర్శించాను. వారి కుటుంబసభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పాను. ఈ కష్ట సమయంలో లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చాను.
లక్ష్మణ్ భార్యకు ఉద్యోగం, పిల్లలను చదివించే బాధ్యత
ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ మృతి చాలా బాధాకరం, దురదృష్టకరం, మా అందరినీ ఎంతగానో కలచి వేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశంతో నేను, పల్లా రాజేశ్వర్ రెడ్డి లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ఓదార్చి, అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చాము. పార్టీ తరఫున ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాం. లక్ష్మణ్ గౌడ్ సతీమణికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి రాజేశ్వర్ రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు'' అని హరీశ్ రావు చెప్పారు.
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన వేముల లక్ష్మణ్ గౌడ్ (40) తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలో చెట్టుకు ఉరివేసుకున్నారు. లక్ష్మణ్ గౌడ్ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన అప్పులకు తోడు, ఇటీవలి కాలంలో పంట నష్టాలు రావడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడన్నారు. 4 ఎకరాల సొంత భూమి ఉండగా, మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. పంటలు నష్టపోవడంతో బంధువులు, ప్రైవేట్ ఫైనాన్షియర్ల నుంచి అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి పెరిగిందని.. ఈ రుణభారంతోనే లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతం అయ్యారు.
ఉద్యమంలోకి వెళ్లి జీవితం నాశనం చేసుకున్నా
కాగా.. ఆత్మహత్యకు ముందు లక్ష్మణ్ గౌడ్ తన సెల్ ఫోన్లో రాసిన నోట్ వెలుగులోకి వచ్చింది. తన తండ్రి తనను కష్టపడి చదివిస్తే, తాను ఉద్యమంలో పాల్గొని జీవితాన్ని పాడు చేసుకున్నానని.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమకారుల బతుకులు మారలేదని అందులో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మణ్ గౌడ్ విద్యార్థి దశ నుంచే బీఆర్ఎస్ యువజన విభాగంలో పని చేశారు.


