Niranjan Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి నిరంజన్ రెడ్డి. పాలమూరుకు సీఎం రేవంత్ చేసింది గుండు సున్నా అని ఆయన విమర్శించారు. పాలమూరుకు ఏం చేశారో చెప్పాలని ముఖ్యమంత్రిని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్ ను తిట్టడమే రేవంత్ రెడ్డి పని మండిపడ్డారు. తిట్లతో రైతులకు నీళ్లు రావని విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహించాలన్నారు. ఈ మూడేళ్లలో కొత్తగా ఒక ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా? ఒక్క చెక్ డ్యామ్ అయినా కట్టారా? అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి. పాలమూరు-రంగారెడ్డి పనులు ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. 10 నుంచి 15శాతం పనులే మిగిలి ఉన్నాయన్నారు. ఈ మూడేళ్లలో పాలమూరు మెయిన్ కెనాల్ లో కనీసం మట్టి తీయలేకపోయారని ధ్వజమెత్తారు.
కొడంగల్ కు మాత్రమే నిధులిచ్చి గొప్పలా?
కొడంగల్ కు మాత్రమే నిధులు మంజూరు చేసి సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను ఇంకా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కర్ణాటక నుంచి ఒక్క చుక్కనీరు కూడా జూరాల ప్రాజెక్టుకు రాలేదన్నారు. పచ్చని పాలమూరుపై సీఎం రేవంత్ పగపట్టారని నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఖర్చుతో బర్త్ డే వేడుకలా?
''ప్రభుత్వ ఖర్చుతో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి బహుశా రేవంత్ రెడ్డి ఒక్కరే ఉంటారేమో. రాష్ట్రం ఖ్యాతిని, పరువును మర్యాదను గానీ, ముఖ్యమంత్రి స్థానానికి ఉండేటువంటి మర్యాదను గానీ ఏనాడు కాపాడే ప్రయత్నం ఆయన చేయట్లేదు. ఇక పర్యటనల గురించి చెప్పాలంటే.. తిప్పడు తిర్నాలకు పోనే పోయిండు రానే వచ్చిండు అన్నట్లుగా ఉంది.
మూడేళ్లలో ఒక్క చెక్ డ్యామ్ కట్టారా? ఒక్క చెరువు కట్టారా?
14 నియోజకవర్గాలలో కొడంగల్ ఒకటి. మిగతా 13 నియోజకవర్గాలకు ఒరిగేటువంటి పని మీరు ఏమైనా చేసి ఉంటే కదా? పాలమూరు బిడ్డ అని చెప్పుకోవడానికి. ఈ 35 నెలల్లో పాలమూరుకు పట్టుమని మీరు చేసినటువంటి పని ఏందో చెప్పండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పారినటువంటి సాగునీళ్లు కాక ఒక్క ఎకరా పొలానికైనా, ఒక్క చెక్ డ్యామ్ కట్టారా? ఒక్క చెరువు కట్టారా? ఒక్క ప్రాజెక్ట్ పనిని ఏమన్నా వేగవంతం చేసి ముందుకు తీసుకెళ్లారా? ఏమీ లేదు. అంతా శూన్యం. మూడేళ్ల కాలంలో పచ్చని పాలమూరు మీద పగబట్టినట్లు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఒక చుక్క నీరు కూడా కర్ణాటక నుంచి జూరాలకు రాలేదు, పాలమూరుకు రాలేదు. ఇదీ మీ గొప్పతనం.
రిజర్వాయర్లను నింపుంటే భూగర్భజలం పెరిగేది..
గత నెల 15 రోజులుగా శ్రీశైలంలో ఉండే నీళ్ళను పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ లను నడిపి, నార్లాపూర్ రెండు పంపులు నడిపితే.. నార్లాపూర్ యధావిధిగా నిండే ఉంటుంది. ఏదుల, ఒట్టెము, కరివెడ.. ఈ మూడు రిజర్వాయర్లను నింపి పెట్టుకుంటే ఈ కరువు కాలంలో భూగర్భ జలం పెరుగుతుందని.. నింపండి అని మొత్తుకున్నాం. కొత్త కెనాల్స్ కు ఎప్పుడు టెండర్ పిలుస్తారో, ఎప్పుడు పని చేస్తారో దేవునికే తెలుసు. మరి ఉన్న రిజర్వాయర్ లు నింపుకుంటే భూగర్భ జలం పెరుగుతుండే కదా? ఈ పని మీరు ఎందుకు చేయడం లేదు? అనేదానికి రేవంత్ సర్కార్ దగ్గర జవాబు లేదు'' అని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.
పాలమూరుకు వెయ్యేండ్లకు సరిపడ విధ్వంసం చేసిందే కాంగ్రెస్
''ఈ 35 నెలల్లో పాలమూరుకు పట్టుమని మీరు చేసినటువంటి పని ఏంటో చెప్పండి. ఆ పని వల్ల ప్రజలకు, అక్కడ వచ్చినటువంటి కొత్త ఉపాధి గానీ, కొత్త మేలు గానీ ఏమైనా ఉందా? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే.. వెయ్యి, 1500 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే పాలమూరు-రంగారెడ్డిలో మిగిలినటువంటి ఆ 10 నుంచి 15శాతం పనులు పూర్తయ్యేవి కదా? లక్షలాది ఎకరాలకు నీళ్లు వచ్చేవి కదా? పాలమూరుకు వెయ్యేండ్లకు సరిపడా విధ్వంసం చేసిందే కాంగ్రెస్. గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో కట్టలేదు. కాంగ్రెస్.. పాలమూరుకు ప్రాజెక్టులు కట్టి ఉంటే నాలుగు దశాబ్దాల క్రితమే 20 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి.
పాలమూరు ప్రజల గొంతు కోసిందే కాంగ్రెస్
కాంగ్రెస్ చేసిన విధ్వంసమే పాలమూరుకు శాపమైంది. కాంగ్రెస్ ఆనాడు గనుక పాలమూరును సమైక్య రాష్ట్రంలో కలిపి ఉండకపోతే అప్పర్ కృష్ణ, భీమా, ఆర్డీఎస్, తుంగభద్ర హైలెవెల్ కెనాల్స్ వీటన్నింటి ద్వారానే 1960 దశకం నాటికే 20 లక్షల ఎకరాలు గ్రావిటీ ద్వారా పాలమూరు జిల్లాలో పారి ఉండేది. మీరు చేసినటువంటి పాపానికి, సమైక్య రాష్ట్రంలో కలిపిన పాపానికి, మీ వరుస ముఖ ముఖ్యమంత్రులు తెలంగాణ ప్రాజెక్టులను, నిజాం కాలనాటి ప్రాజెక్టుల ప్లాన్స్ మొత్తాన్ని విధ్వంసం చేసేసి సమైక్య రాష్ట్రంలో మీరు కట్టినటువంటి ప్రాజెక్టులు కిందికి తీసుకొని పోయి కట్టి పాలమూరు ప్రజల గొంతుకోసిందే కాంగ్రెస్ పార్టీ'' అంటూ నిప్పులు చెరిగారు నిరంజన్ రెడ్డి.


