rice price hike: నిత్యావసర సరుకుల ధరలతో ఇప్పటికే విలవిల్లాడుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బియ్యం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వంటింట్లో అన్నం ముద్ద దిగకుండా సన్న బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మార్కెట్లో సూపర్ ఫైన్ రకం సన్న బియ్యం కిలో ధర ఏకంగా రూ.90 నుంచి రూ.95కు చేరుకుంది. ధరల పెరుగుదల చూస్తుంటే త్వరలోనే కిలో వంద రూపాయల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. కేవలం ఒక్క వారంలోనే 25 కిలోల బస్తాపై రూ.450 వరకు పెంచేయడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
మూడు నెలల్లోనే క్వింటాల్‌పై రూ.3,000 పెంపు
జూలై నుంచి క్రమంగా పెరుగుతున్న ధరలు అక్టోబర్ నాటికి ఊహించని స్థాయికి చేరాయి. ప్రీమియం రకంగా పేరున్న 'జై శ్రీరామ్' రకం బియ్యం జూన్‌లో క్వింటాల్ ధర రూ.5,600 నుంచి రూ.6,300 మధ్య ఉండగా, ప్రస్తుతం క్వాలిటీని బట్టి ఏకంగా రూ.8,400 నుంచి రూ.9,200 వరకు పలుకుతోంది. అంటే మూడు నెలల వ్యవధిలోనే క్వింటాల్‌పై ఏకంగా రూ.3,000 వరకు భారం పడింది. ఇక హెచ్ఎంటీ, బీపీటీ, ఆర్ఎస్ఆర్ లాంటి రకాలు జూన్‌లో రూ.4,600 నుంచి రూ.5,500 ఉంటే, ప్రస్తుతం రూ.7,000 నుంచి రూ.8,000 వరకు పలుకుతున్నాయి. కొన్ని ఖరీదైన రకాల ధరలు రూ.9,000 మార్కును కూడా దాటిపోయాయి.
'ఎల్నినో' బూచితో కృత్రిమ కొరత
ఈ ధరల పెంపునకు వ్యాపారులు ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను కారణంగా చూపుతున్నారు. వరి సాగు విస్తీర్ణం 15 లక్షల ఎకరాల మేర తగ్గిందని, దిగుబడులు పడిపోయి భవిష్యత్తులో తీవ్ర కొరత వస్తుందనే ప్రచారాన్ని వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పాత నిల్వలు తగ్గిపోయాయని, కొత్త పంట మార్కెట్‌కు ఇంకా రాలేదని చెబుతూ.. ధాన్యాన్ని మిల్లింగ్ చేసిన వెంటనే మార్కెట్లోకి వదలకుండా దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సర్కార్ జోక్యం చేసుకోవాలి!
నగరాలు, పట్టణాల్లో నాణ్యమైన సన్న బియ్యానికే డిమాండ్ ఎక్కువ ఉండటంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ధరల పెరుగుదల వల్ల సామాన్య కుటుంబాలతో పాటు హాస్టళ్లు, మెస్సులు, చిన్నపాటి హోటళ్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే హోటళ్లలో ఫుడ్ రేట్లు కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మార్కెట్‌లో బియ్యం సరఫరాను సమీక్షించాలని, వ్యాపారుల అక్రమ నిల్వలపై తనిఖీలు చేసి ఈ ధరల మంటకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


