TGPSC AEE Exam: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయొద్దని హరీశ్ రావు కోరారు. నవంబర్ 6న జరగనున్న TGPSC AEE (సివిల్) పరీక్షను వెంటనే వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. SSC JE, TGPSC AEE పరీక్షలు ఒకే తేదీలో ఉండటంతో వేలాది మంది తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని హరీశ్ రావు వాపోయారు.
రెండు పోటీ పరీక్షల్లో ఒకదాన్ని వదులుకోవాల్సిన దుస్థితి
ఇతర రాష్ట్రాల్లో SSC JE పరీక్ష రాసే అభ్యర్థులు వెంటనే తెలంగాణకు తిరిగొచ్చి AEE పరీక్ష రాయడం ఎలా సాధ్యం? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి కష్టపడి సిద్ధమైన నిరుద్యోగ యువత.. రెండు పోటీ పరీక్షల్లో ఒకదాన్ని వదులుకోవాల్సిన దుస్థితిని రేవంత్ ప్రభుత్వం కల్పించిందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. పరీక్షల తేదీలు మార్చాలని అభ్యర్థులు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా TGPSC స్పందించలేదని ఆరోపించారు. కాగా, పరీక్షల తేదీలను పునఃపరిశీలించాలని అక్టోబర్ 14నే TGPSCకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు.
నిరుద్యోగ యువత భవిష్యత్తును బలి చేయొద్దు
నిరుద్యోగ యువత కోరుతున్నది ఉద్యోగాలు ఇవ్వకుండా పరీక్షలు వాయిదా వేయాలని కాదు.. రెండు పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని మాత్రమే అని హరీశ్ రావు పేర్కొన్నారు. ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాల్లో పరీక్షల తేదీలు మార్చినప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు? అని నిలదీశారు. సీఎం రేవంత్ బేషజాలకు పోయి నిరుద్యోగ యువత భవిష్యత్తును బలి చేయొద్దని హరీశ్ రావు అన్నారు. తక్షణమే జోక్యం చేసుకుని నవంబర్ 6న జరగనున్న TGPSC AEE (సివిల్) పరీక్షను వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి గందరగోళం పునరావృతం కాకుండా ప్రభుత్వం, TGPSC ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంకు రాసిన లేఖలో హరీశ్ రావు సూచించారు.


