Jagadish Reddy: కొందామన్నా కూడా మార్కెట్ లో కరెంటు దొరకడం లేదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కరెంటు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు అంటూ నిప్పులు చెరిగారు. బయట మార్కెట్ లో కరెంట్ యూనిట్ ధర రూ.2 నుండి రూ.7 లోపే దొరుకుతుంటే రూ.15 రూపాయలు పెట్టినా దొరకట్లేదని అబద్ధాలు చెప్పడానికి సిగ్గు లేదా? అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు.
కరెంట్ ఇవ్వడం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతోందా?
ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ ప్రకారం యూనిట్ ధర రూ.3.97 నుండి రూ.6.74 మధ్య కరెంట్ అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. రాత్రి పూట రూ. 1.90 కూడా యూనిట్ కరెంటు దొరుకుతుందని వెల్లడించారు. అయితే యూనిట్ కు 15 రూపాయలు చెల్లించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా మార్కెట్ లో విద్యుత్ దొరకడం లేదు అంటూ సీఎం రేవంత్ అబద్ధాలు ఆడుతున్నారని జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. కరెంట్ అంటే ఏంటో.. కరెంట్ ఇవ్వడం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతోందా? అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారాయన. ఒకానొక కాలంలో గుజరాత్‌తో సహా దేశం మొత్తం కరెంట్ సంక్షోభం ఉన్నా.. తెలంగాణలో ఒక్క నిమిషం కూడా కేసీఆర్ కరెంట్ పోనియ్యలేదని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
ఎక్కువ ధరకు కొన్నారని కేసీఆర్ పై దుష్ప్రచారం చేశారు
''విద్యుత్ విషయంలో కాంగ్రెస్ నాయకులు చెబుతున్న అబద్ధాలను ప్రజలు గమనిస్తున్నారు. ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (IEX) ప్రకారం యూనిట్ ధర రూ.3.97 నుండి రూ.6.74 మధ్య కరెంట్ అందుబాటులో ఉంది. రాత్రిపూట రూ. 1.90 కూడా దొరుకుతోంది. కరెంటుపై ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పే అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆలోచించండి. రూ. 10 నుంచి 15 పెట్టినా కరెంట్ దొరకడం లేదని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు.
కేసీఆర్ ఎక్కువ ధరకు కరెంట్ కొన్నారని దుష్ప్రచారం చేశారు కదా. కరెంట్ అంటే ఏంటో, నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వడం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతోందా? నాడు గుజరాత్‌తో సహా దేశమంతటా తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉన్నా, తెలంగాణలో ఒక్క నిమిషం కూడా కేసీఆర్ కరెంట్ పోనివ్వలేదు'' అని జగదీశ్ రెడ్డి అన్నారు.
ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్.. విద్యుత్ ధరలకు సంబంధించి ఏ రోజు ఏ గంటకు ఎంత ధరకు ఎక్కడెక్కడ విద్యుత్ అందుబాటులో ఉందని తెలిపే పట్టిక ఇది. IEX ప్రకారం గత వారం అంతా కూడా రూ.3.97 పైసల నుంచి రూ.6.74 పైసల వరకు యూనిట్ విద్యుత్ ధర ఉంది. రాత్రిపూట 10గంటల తర్వాత రూ.1.90 పైసలకు కూడా విద్యుత్ దొరుకుతోంది. తెలంగాణ ప్రజలారా, రైతులారా అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి, మంత్రులు ఏ స్థాయిలో అబద్దాలు చెబుతున్నారో తెలుసుకోండి. రూ.6.74 పైసలు అత్యధికం అయితే, రూ.1.90 అత్యల్పం. ఆనాడు కేసీఆర్ అలర్ట్ గా ఉండి.. ఏ నిమిషంలో తక్కువ ధరకు దొరుకుతుందో ఆ నిమిషంలో విద్యుత్ కొనుగోలు చేశారు.
కేసీఆర్ మందుచూపుతో కట్టుకున్న ప్రాజెక్టులే యాదాద్రి, భద్రాద్రి
15 రూపాయలు పెట్టినా మార్కెట్ లో విద్యుత్ దొరకడం లేదు అంటూ రేవంత్ కబుర్లు చెబుతున్నారు. మార్కెట్ మీద ఆధారపడితే ఎక్కువ ధరకు విద్యుత్ కొనాల్సి వస్తుందనే ముందు చూపుతో.. మనమే కట్టుకుందాం ప్రాజెక్టులు అని కట్టుకున్నవే యాదాద్రి, భద్రాద్రి. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పిన మోసపు, ద్రోహపు మాటలను ప్రజలంతా గమనించాలి. ఇన్ని రోజులు కేసీఆర్ పై వాళ్లు చేసిన దుష్ప్రచారాన్ని గమనించాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న గుజరాత్ తో సహా దేశం మొత్తం ఒకసారి విద్యుత్ సంక్షోభం వచ్చింది.
ఎవరిని గుంజకు కట్టేయాలో ప్రజలే నిర్ణయించాలి
20 రూపాయలు పెట్టి కొందామంటే కూడా నాడు ఎవరికీ కరెంటు దొరకలేదు. కానీ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోనివ్వలేదు కేసీఆర్. నాడు కేసీఆర్ ఎంత జాగ్రత్తగా ఉండి పని చేస్తే తెలంగాణను కాపాడుకోగలిగారో ప్రజలంతా గమనించాలి. ఇవన్నీ చూశాక ఎవరిని గుంజకు కట్టేయాలో ప్రజలే నిర్ణయించాలి'' అని జగదీశ్ రెడ్డి అన్నారు.


