TG: హైదరాబాద్ నగరంలో తాగునీరు వృథా కాకుండా చూసేందుకు జలమండలి అధికారులు కఠిన ఆంక్షలు పెట్టారు. ముఖ్యంగా నగరంలో తిరిగే వాటర్ ట్యాంకర్ల నుంచి రోడ్ల మీద నీళ్లు కారిపోవడంపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ట్యాంకర్ల నుంచి ఒక్క చుక్క నీరు కూడా వృథా కావడానికి వీల్లేదని, రూల్స్ గాలికొదిలేస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు.
నవంబర్ 1 నుంచి భారీ జరిమానా
ట్యాంకర్ల ద్వారా నీటిని వృథా చేస్తే నవంబర్ 1 నుంచి ఏకంగా రూ.5 వేల జరిమానా ఫైన్ వేయబోతున్నట్లు తెలిపారు. ఒకవేళ మొదటిసారి ఫైన్ పడ్డా కూడా తీరు మార్చుకోకుండా అదే ట్యాంకర్ మళ్లీ పట్టుబడితే.. ఏకంగా ఆ ట్యాంకర్ రిజిస్ట్రేషన్‌నే రద్దు చేస్తామని ఎండీ స్పష్టం చేశారు. తాగునీటి విలువ తెలియకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని అధికారులు తేల్చేశారు.
లీకేజీలు ఉంటే నీళ్లు నింపే ఛాన్సే లేదు!
ట్యాంకర్లకు సరైన మూతలు లేకపోవడం, పైపుల నుంచి లీకేజీలు ఉండటం వల్లే ట్రావెలింగ్ టైంలో రోడ్లంతా నీళ్లంతా వృథా అవుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. అందుకే ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గరే అధికారులు పక్కాగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. ట్యాంకర్‌లో నీళ్లు నింపే ముందే మూతలు సరిగ్గా ఉన్నాయా? ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా? అనేది చూసుకోవాలని సూచించారు. ఏ చిన్న లోపం ఉన్నా దాన్ని బాగు చేసే వరకు ఆ ట్యాంకర్‌లో నీళ్లు నింపొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తాగునీటి విషయంలో ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు బాధ్యతగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.


