* పాలమూరు ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రేవంత్ రెడ్డి..
* సొంత జిల్లా రైతాంగానికే ద్రోహం తలపెట్టడం దుర్మార్గం
* కేసీఆర్ పాలమూరు మెడకు వేసిన ‘డిండి ఉరితాడు’ను ఇప్పుడు రేవంత్ రెడ్డి బిగిస్తున్నారు
* పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగం కాని డిండి లిఫ్ట్‌ను తక్షణమే రద్దు చేయాలి
* శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టూ పాలమూరుకే దక్కాలి
* నల్గొండకు నీళ్లందించేందుకు ఎస్ఎల్‌బీసై, నక్కలగండి వంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా..
* పాలమూరు హక్కులను కాలరాయడం ఎందుకు?
* పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ హయాం నాటి జీవో 72 ప్రకారం జూరాల ఆధారిత పాత డిజైన్‌తోనే పూర్తి చేయాలి
* పాలమూరు జిల్లా ప్రయోజనాల కోసం కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు మెదపకపోతే ప్రజలే గుణపాఠం చెప్తారు
Dindi: సీఎం రేవంత్ రెడ్డిపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ నిప్పులు చెరిగారు. పాలమూరు ప్రజల ఆశీర్వాదంతో సీఎం కుర్చీ దక్కించుకున్న రేవంత్ రెడ్డి.. నాడు కేసీఆర్ పాలమూరు మెడకు వేసిన ‘డిండి ఉరితాడు’ను ఇప్పుడు బిగించే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట పాలమూరు జిల్లా రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ తో కలిసి నిర్వహించిన నీటిపారుదల సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే ముఖ్యమంత్రికి ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఏమాత్రం ప్రేమ లేదని స్పష్టమవుతోందని ఫైరయ్యారు.
పాలమూరు రైతాంగానికి ద్రోహం
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఆశీర్వదించి గెలిపించినందువల్లే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారన్న వాస్తవాన్ని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. ముఖ్యమంత్రి స్వగ్రామం ఉన్న నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని రైతులకు, యావత్ పాలమూరు రైతాంగానికి ద్రోహం చేసేలా ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తాను మంత్రిగా ఉండి పాలమూరు జిల్లా ప్రయోజనాలను కాపాడేందుకు, ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలనే లక్ష్యంతో జూరాల ప్రాజెక్టు ఆధారంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ సర్వే కోసం జీవో నెంబర్ 72ను తీసుకొచ్చిన విషయాన్ని డీకే అరుణ గుర్తుచేశారు.
అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజినీర్ల నివేదికలను తుంగలో తొక్కి, ప్రాజెక్టు అప్రోచ్‌ను జూరాల నుంచి నార్లాపూర్ శ్రీశైలం బ్యాక్ వాటర్‌కు మార్చి డిజైన్లనే మార్చేశారని ఆరోపించారు. ఆ సమయంలో తామంతా తీవ్రంగా వ్యతిరేకించినా వినకుండా మొండిపట్టుతో మార్పులు చేసి, ఆ తర్వాత జీవో 105, 107లను తెచ్చి డిండి లిఫ్ట్ కోసం పాలమూరు ప్రాజెక్టు ద్వారా రోజుకు 0.5 టీఎంసీ తరలించే కుట్ర చేశారన్నారు.
కేసీఆర్ ఉరితాడు వేస్తే.. రేవంత్ ఉచ్చు బిగిస్తున్నారు
నాడు కేసీఆర్ పాలమూరు రైతుల మెడకు ఉరితాడు వేస్తే, ఎమ్మెల్యేలతో కలిసి పెద్దఎత్తున పోరాడి ఆ పనులను అడ్డుకున్నామని తెలిపారు. కానీ నేడు ముఖ్యమంత్రిగా వచ్చిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ వేసిన అదే ఉరితాడుకు మరింత ఉచ్చు బిగిస్తూ డిండి లిఫ్ట్ ప్రాజెక్టును మళ్లీ తెరపైకి తెచ్చి పాలమూరుకు దగా చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల హక్కులను హరించడమే
నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు ఫ్లోరైడ్ ప్రాంతాల సమస్య పరిష్కారానికి పుట్టగండి లిఫ్ట్, ఎస్ఎల్ బీసి (ఏఎంఆర్ ప్రాజెక్ట్), నక్కలగండి వంటి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా నీటిని తరలించడంలో ఎవరికీ అభ్యంతరం లేదని డీకే అరుణ స్పష్టం చేశారు. కానీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేని డిండి లిఫ్ట్‌ను బలవంతంగా లింక్ చేస్తూ, ఏదుల రిజర్వాయర్ నుంచి పైప్‌లైన్లు వేసి నీటిని తరలిస్తామని చెప్పడం జిల్లా రైతుల హక్కులను హరించడమే అన్నారు.
స్వప్రయోజనాల కోసం జిల్లా హక్కులను తాకట్టు పెడతారా?
శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అదనంగా 0.6 టీఎంసీలు కాదు కదా.. ఒకటి లేదా రెండు టీఎంసీలు తోడే సామర్థ్యం ఉంటే ఆ నీటినంతా ఇంకా లక్షలాది ఎకరాలు బీడుపడి ఉన్న మహబూబ్ నగర్ జిల్లాకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిండి ప్రాజెక్టు కాల్వల వల్ల దాదాపు 60 కిలోమీటర్ల మేర పాలమూరు భూములు, 30కి పైగా గ్రామాలు ముంపునకు గురవుతుంటే ఇక్కడి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. నల్గొండ నాయకులు తమ ప్రాంత ప్రయోజనాల కోసం ఏకమవుతుంటే పాలమూరు ప్రతినిధులు తమ స్వప్రయోజనాల కోసం జిల్లా హక్కులను తాకట్టు పెడతారా? అని ప్రశ్నించారు.
మూడేళ్లు అవుతున్నా పూడిక తీయలేదని, మరమ్మతులు చేయలేదు
పాలమూరు జిల్లాలోని నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు దశాబ్దకాలంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయని డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి మూడేళ్లు గడుస్తున్నా రిజర్వాయర్లలో పూడిక తీయలేదని, మరమ్మతులు చేపట్టలేదని, ఆర్డీఎస్ కింద ఉన్న 15.9 టీఎంసీలు, జూరాల కింద ఉన్న 17.84 టీఎంసీల కేటాయింపులను కూడా పూర్తిస్థాయిలో ఒడిసిపట్టలేక వరద నీటిని దిగువకు వదిలేస్తున్నారని మండిపడ్డారు.
పాలమూరు రైతాంగ ప్రయోజనాల కోసం పోరాటం
జూరాల ప్యారలల్ ప్రాజెక్టు, బ్రిడ్జి పనులకు నిధులు కేటాయించకుండా, నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున సాగునీరు ఇచ్చే సమగ్ర కార్యాచరణ లేకుండా కొడంగల్, నారాయణపేటలకే అరకొరగా పరిమితం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి ఏ ఒక్కరికీ శాశ్వతం కాదని, పాలమూరు-రంగారెడ్డిని జూరాల నుంచి ప్రారంభించేలా నాటి అసలైన డీపీఆర్‌ను తిరిగి సమీక్షించి, పాలమూరు పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికీ సాగునీరు అందించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పాలమూరు రైతాంగ ప్రయోజనాల కోసం రాజీలేని ప్రజాపోరాటం నిర్మిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు డీకే అరుణ.


