TG: హైదరాబాద్ నడిబొడ్డున అర్ధరాత్రి పూట తుపాకీతో ఒక యువకుడు చేసిన రచ్చ తీవ్ర కలకలం రేపింది. సోమాజిగూడలోని ఫేమస్ ‘హెడ్ క్వార్టర్స్ బార్ అండ్ రెస్టారెంట్’లో ఈ సీన్ వెలుగు చూసింది. బార్లో తిని తాగిన తర్వాత బిల్లు కట్టడమే కాకుండా.. మళ్లీ లోపలికి వచ్చి ఆ కట్టిన బిల్లు డబ్బులను వెంటనే వెనక్కి ఇచ్చేయాలంటూ గన్ తీసి బెదిరించడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
థార్ కారులోంచి రివాల్వర్ తీసి బెదిరింపులు
అసలేం జరిగిందంటే.. బార్లో బిల్లు కట్టే విషయంలో సిబ్బందితో మహమ్మద్ షానవాజ్ (24) అనే యువకుడు అర్ధరాత్రి వేళ గొడవకు దిగాడు. మాటా మాటా పెరగడంతో కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు.. బయట పార్క్ చేసి ఉన్న తన థార్ కారు దగ్గరికి వెళ్లి అందులోంచి రివాల్వర్ బయటకు తీశాడు. నేరుగా బార్లోకి వచ్చి, "నేను కట్టిన బిల్లు డబ్బులు వెంటనే నాకు ఇచ్చేయాలి.. లేకపోతే కాల్చిపారేస్తా" అంటూ తుపాకీ గురిపెట్టి సిబ్బందిని, అక్కడున్న కస్టమర్లను బెదిరించాడు.
బౌన్సర్లు అడ్డుకోవడంతో సేఫ్
అతడి చేతిలో తుపాకీ చూడగానే బార్లో ఉన్న జనాలు, సిబ్బంది ప్రాణభయంతో తలోదిక్కు పరుగుతీశారు. ఎక్కడ కాల్పులు జరుగుతాయోనని అంతా వణికిపోయారు. సరిగ్గా అదే టైమ్‌లో బార్‌లోని బౌన్సర్లు చాలా చాకచక్యంగా అతడిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని షానవాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గరున్న రివాల్వర్‌తో పాటు థార్ కారును సీజ్ చేశారు. బార్ మేనేజ్మెంట్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, ఆ తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది? లైసెన్స్ ఉందా లేదా? అనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నారు.


