TG: హైదరాబాద్ నగరంలో దశాబ్దాలుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ నీటి దందాపై హైడ్రా పక్కా ప్లాన్‌తో దాడి చేసింది. సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లోని ఇళ్లనే అడ్డాగా చేసుకుని అక్రమంగా నీటిని తోడేస్తున్నారన్న సమాచారంతో అధికారులు చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ ఇప్పుడు నగరవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఎవరూ కనిపెట్టకుండా ఉండేందుకు ఏకంగా పడుకునే బెడ్‌రూమ్‌లు, వంటగదులు, నీళ్ల సంపుల్లోనే భారీ బోర్లు వేసి కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్న కేటుగాళ్ల గుట్టును అధికారులు మీడియా సమక్షంలోనే రట్టు చేశారు.
ఇంట్లో బోరు.. వందల మీటర్ల దూరం అండర్‌గ్రౌండ్ పైపులు
జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, జలమండలి సిబ్బందిని కలుపుకుని హైడ్రా టీమ్ శనివారం తెల్లవారుజామున 6:30 గంటలకే సున్నం చెరువు చెంత రంగంలోకి దిగింది. ఇళ్ల లోపల భారీ మోటార్లతో బోర్లు వేసి, అక్కడి నుంచి వందల మీటర్ల మేర భూమి అడుగున పైపులు పరిచి నీటిని మరో ప్రాంతానికి గుంజేస్తున్నారు. అక్కడ పెద్ద ట్యాంకర్ల నుంచి చిన్న ట్యాంకర్లలోకి నీళ్లను మార్చి మార్కెట్లో అమ్ముకుంటున్నారు. నవభారత్‌నగర్, బోరబండ ఫేజ్ 3 ప్రాంతాల్లో సాగిన ఈ సోదాల్లో 15 బోర్లను నేరుగా నేలమట్టం చేయడంతో పాటు, వీటికి అనుసంధానంగా ఉన్న పదుల సంఖ్యలోని భారీ పైప్‌లైన్లను అధికారులు అక్కడికక్కడే పీకిపారేశారు.
మాదాపూర్ హోటళ్లు, హాస్టళ్లకు ప్రాణాంతక విషపు నీరు
ఈ ఆపరేషన్‌లో మరో దిగ్భ్రాంతికరమైన వాస్తవం వెలుగు చూసింది. గతంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో సున్నం చెరువు పరిసరాల్లోని బోరు నీటిలో సీసం, కాడ్మియం, నికెల్ లాంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు తేలింది. ఈ నీళ్లు వాడితే క్యాన్సర్, లివర్ డ్యామేజ్ కావడంతో పాటు గర్భిణులకు గర్భస్రావాలు జరిగేంత ప్రమాదం ఉంది. అలాంటి కలుషిత నీటినే మాదాపూర్ లాంటి ఐటీ కారిడార్లలోని హాస్టళ్లు, హోటళ్లకు రోజువారీగా సప్లై చేస్తూ జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
600 అడుగులు వేసినా చుక్క నీరు లేదు.. ఎట్టకేలకు ఊరట
చెరువును ఆనుకుని ఉన్న అక్రమ బోర్ల దెబ్బకు పరిసరాల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయని స్థానికులు లబోదిబోమంటున్నారు. ఒకప్పుడు 60 అడుగులకే పుష్కలంగా పడే నీళ్లు.. ఇప్పుడు 600 అడుగులు వేసినా రావడం లేదని, బోర్లలో నీళ్లు లేక మోటార్లు కాలిపోయి తామే ట్యాంకర్ల నీళ్లు కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చిందని జనం ఆవేదన వెళ్లగక్కారు. తాగునీటి సమస్య మరింత తీవ్రం కాకముందే హైడ్రా నేరుగా రంగంలోకి దిగి ఈ అక్రమ బోర్ల నెట్‌వర్క్‌ను కూల్చివేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.


