National

Bank Loan Tips: బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే రోడ్డున పడటం ఖాయం!

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

Bank Loan Tips: సొంతిల్లు కట్టుకోవాలన్నా, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, లేదా కొత్త బిజినెస్ మొదలుపెట్టాలన్నా చేతిలో ఒకేసారి లక్షల రూపాయలు ఉండటం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటి టైమ్‌లో బ్యాంకులు ఇచ్చే లోన్లే పెద్ద ఆసరాగా నిలుస్తాయి.

Bank Loan Tips: సొంతిల్లు కట్టుకోవాలన్నా, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, లేదా కొత్త బిజినెస్ మొదలుపెట్టాలన్నా చేతిలో ఒకేసారి లక్షల రూపాయలు ఉండటం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటి టైమ్‌లో బ్యాంకులు ఇచ్చే లోన్లే పెద్ద ఆసరాగా నిలుస్తాయి. అయితే లోన్ తీసుకోవడం ఎంత తేలికో.. దాన్ని తిప్పి కట్టేటప్పుడు అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం ఆలోచించకుండా తొందరపడి అప్పు చేస్తే, ఆ లోనే భవిష్యత్తులో గొంతుకు ఉరితాడులా మారి ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొడుతుంది. బ్యాంకుల చుట్టూ తిరిగే ముందు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన కీలక విషయాలివే.

ఎక్కువ ఇస్తున్నారని ఆశపడితే అంతే సంగతులు

చాలామంది చేసే మొదటి పొరపాటు అవసరానికి మించి అప్పు చేయడం. మన జీతం, క్రెడిట్ స్కోర్ బాగున్నాయని చెప్పి బ్యాంకులు మనం అడిగిన దానికంటే ఎక్కువ మొత్తం ఆఫర్ చేస్తాయి. ఎక్కువ డబ్బు చేతికి వస్తోందన్న ఆశతో ఎగబడితే అంతే సంగతులు. చేతిలో పైసలు ఉన్నప్పుడు బాగానే అనిపించినా, ప్రతినెలా ఈఎంఐలు కట్టేటప్పుడు మాత్రం ఇల్లు గడవడం కష్టమైపోతుంది. మీ అవసరానికి ఎంత మొత్తమైతే సరిపోతుందో, మీ నెలవారీ ఆదాయంలోంచి ప్రశాంతంగా ఎంత ఈఎంఐ కట్టగలరో అంత మాత్రమే లోన్ తీసుకోవాలి.

కళ్లు మూసుకుని సంతకాలు పెడుతున్నారా

లోన్ తొందరగా పాస్ అయిపోవాలన్న కంగారులో చాలామంది అగ్రిమెంట్ పేపర్లను అస్సలు చదవరు. అందులో రాసి ఉన్న కండిషన్లు పట్టించుకోకుండా గుడ్డిగా సంతకాలు పెట్టేస్తుంటారు. అసలు వడ్డీ రేటు ఎప్పటికీ ఒకేలా ఉండే స్థిరమైనదా లేక మార్కెట్‌ను బట్టి మారే ఫ్లోటింగా? ఒకవేళ మధ్యలోనే లోన్ క్లియర్ చేయాలనుకుంటే ప్రీ-పేమెంట్ ఛార్జీలు ఏమైనా ఉంటాయా? ఏదైనా కారణం వల్ల ఈఎంఐ ఒకట్రెండు రోజులు లేట్ అయితే పడే పెనాల్టీలు ఎంత? లాంటి హిడెన్ ఛార్జీల గురించి ముందే తెలుసుకోవాలి. లేదంటే లేనిపోని ఛార్జీల పేరుతో జేబులు గుల్లైపోతాయి. అలాగే కేవలం తెలిసిన బ్యాంకునే కాకుండా కనీసం 3 నుంచి 4 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలలో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులను పోల్చి చూసి ఎక్కడ తక్కువ ఖర్చవుతుందో అక్కడే లోన్ తీసుకోవడం మంచిది.

ఈఎంఐ తేదీ ఒకటో తారీఖున అస్సలు పెట్టొద్దు

లోన్ తీసుకునేటప్పుడు ఎంత ఈఎంఐ కట్టాలనేది పక్కాగా లెక్కేసుకోవాలి. మీ నెలవారీ జీతంలో అన్ని ఈఎంఐలు కలిపి 40 శాతం మించకుండా చూసుకోవాలి. అంతకంటే ఎక్కువైతే ఇంటి ఖర్చులకు చేతిలో పైసా మిగలదు. ఇక చాలామంది చేసే మరో పెద్ద తప్పు ఈఎంఐ కట్ అయ్యే డేట్ ఎంపిక. మీ శాలరీ ఒకటో తారీఖున పడుతుందని చెప్పి, అదే రోజున ఈఎంఐ డేట్ పెట్టుకుంటే ఒక్కోసారి జీతం ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా ఈఎంఐ బౌన్స్ అవుతుంది. దీంతో క్రెడిట్ స్కోర్ దెబ్బతినడమే కాకుండా భారీగా పెనాల్టీలు పడతాయి. అందుకే శాలరీ పడిన నాలుగైదు రోజుల తర్వాత, అంటే 5 లేదా 7వ తేదీల్లో ఈఎంఐ డేట్ పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు.

#Bank Loan Tips#Bank Loan Tips Telugu#Bank Loan Mistakes#Common Loan Mistakes#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి