Jurala: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జూరాల ప్రాజెక్ట్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE) కార్యాలయంలో రికార్డులు దగ్ధమైన ఘటన కలకలం రేపుతోంది. కార్యాలయంలో భద్రపరిచిన పాత రికార్డులను ఒక ఉద్యోగి కార్యాలయం బయట కాల్చివేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఈ కార్యాలయం రికార్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఈశ్వరయ్య డివిజన్ -1 బదిలీపై వెళ్లారు. అతడి స్థానంలో వచ్చిన దినేష్ అనే ఉద్యోగికి రికార్డులు అప్పజెప్పాల్సి ఉంది. అయితే జూరాల ప్రాజెక్టు నిర్మాణం నాటి నుంచి ఇప్పటివరకు సంబంధించిన అనేక ముఖ్యమైన పత్రాలను బదిలీపై వెళ్లిన ఉద్యోగి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా తగలబెట్టినట్లు సమాచారం.

ప్రొజెక్టర్‌ను కూడా ఎత్తుకెళ్లారు
అందులో ఒరిజినల్ సంతకాలు ఉన్న పత్రాలు (ఆధారాలు/ఫైళ్లు) కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కార్యాలయంలో ఉన్న ప్రొజెక్టర్‌ను కూడా గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయాల మార్పులు, రికార్డుల తరలింపు సమయంలో కొన్ని పత్రాలు దెబ్బతిన్నప్పటికీ, ప్రాజెక్టు ప్రారంభం నుండి ఉన్న కీలక రికార్డులను ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు.

రికార్డులు తగలబెట్టిన ఉద్యోగికి మెమో
ఈ ఘటనను గుర్తించిన కార్యాలయ ఉన్నతాధికారి సదరు ఉద్యోగికి మెమో జారీ చేశారు. అంతేకాకుండా, అతనిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం జూరాల SE సెలవులో ఉండటంతో తదుపరి చట్టపరమైన, శాఖాపరమైన చర్యల ప్రక్రియ నిలిచిపోయినట్లు సమాచారం.
అక్రమాలను కప్పిపుచ్చేందుకు తగలబెట్టారా?
కేవలం "పాత రికార్డులే కదా" అనే ఉద్దేశంతో ఉదాసీనంగా కాల్చేశారా? లేక ఏదైనా అక్రమాలను కప్పిపుచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ పనికి ఒడిగట్టారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయి విచారణ జరిపితేనే నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా ఇదే జిల్లాలోని మానవపాడు తహసీల్దార్ కార్యాలయం, గద్వాల జిల్లా పంచాయతీ కార్యాలయంలో రికార్డులు దగ్ధమైన ఘటనలను ఈ సందర్భంగా స్థానికులు, ఉద్యోగులు గుర్తుచేసుకుంటున్నారు.

కీలకమైన రికార్డుల భద్రతపై అనుమానాలు
ప్రభుత్వ కార్యాలయాల్లో అత్యంత కీలకమైన రికార్డుల భద్రతపై ఈ వరుస ఘటనలు తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. దీనిపై జూరాల డీఎస్ఈ ప్రభాకర్ రెడ్డి వివరణ కోరగా రికార్డులు కాల్చింది వాస్తవేమని, అవి వేస్టేజ్ రికార్డులు అని తెలిపారు. అయితే బదిలీపై వెళ్లిన రికార్డ్ అసిస్టెంట్ డ్యాకుమెంట్ పైల్స్ అప్పజెప్పకుండా ఇలా కాల్చడం నేరమన్నారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదని, దీనిపై అతనికి మెమోలు జారీ చేసి, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు.



