bjp : తెలంగాణలో జరగబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పక్కా ప్లాన్‌తో బీజేపీ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి కేడర్‌లో పూర్తిస్థాయిలో జోష్ నింపేందుకు ఈ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా పరిగణిస్తూ అధిష్టానం గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. ఒకవైపు ఓటర్ల నమోదు ప్రక్రియను పరుగులు పెట్టిస్తూనే, మరోవైపు సామాజిక సమీకరణాలను సమతుల్యం చేస్తూ అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది. రెండు స్థానాల్లో ఒకచోట ఓసీ, మరోచోట బీసీ అభ్యర్థిని బరిలోకి దించి విజయం సాధించాలనే వ్యూహంతో కమలనాథులు ముందుకెళ్తున్నారు.
హైదరాబాద్‌లో ఓసీ.. వరంగల్‌లో బీసీ ఫార్ములా
పార్టీ అంతర్గత సమాచారం ప్రకారం.. సామాజిక సమీకరణాల లెక్కలతో ఇద్దరు కీలక నేతల పేర్లను బీజేపీ పెద్దలు పరిశీలిస్తున్నారట. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం నుంచి ఓసీ కోటాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు పేరు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. విద్యావంతుడిగా, న్యాయవాదిగా గతంలో ఇదే స్థానం నుంచి పనిచేసిన అనుభవం ఆయనకు కలిసివచ్చే అంశం అని చెబుతున్నారు. ఇక వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో బీసీ కార్డును బలంగా ప్రయోగించాలని భావిస్తున్న కమలదళం.. పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి భిక్షం గౌడ్ పేరును పరిశీలిస్తోందట.
తెరవెనుక ఉపాధ్యాయ సంఘాల మంతనాలు
వరంగల్ బరిలో బీసీ అభ్యర్థిగా భిక్షం గౌడ్‌ను నిలబెట్టేందుకు టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి నేతృత్వంలో పీఆర్‌టీయూ నేతలు బీజేపీ, ఆరెస్సెస్ పెద్దలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. భిక్షం గౌడ్‌కు టికెట్ కేటాయిస్తే ఉమ్మడి మూడు జిల్లాల్లోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పట్టభద్రుల ఓట్లను గంపగుత్తగా బీజేపీ ఖాతాలో వేయిస్తామని శ్రీపాల్ రెడ్డి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిఫలంగా హైదరాబాద్ స్థానంలోనూ బీజేపీ ఓసీ అభ్యర్థికి పీఆర్‌టీయూ సంపూర్ణ మద్దతు ఇస్తుందనే పరస్పర ఒప్పందంపై చర్చలు నడిచాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల ఓట్లు ఈ ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేయగలవని బీజేపీ నేతలు బలంగా నమ్ముతున్నారు.
ఎన్నికల సమీకరణాలా? విధేయతా?
అయితే బయటి సంఘాల నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడంపై పార్టీలోని కొందరు సీనియర్లు, ఏళ్ల తరబడి జెండాలు మోసిన విధేయుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తుంది. అయినప్పటికీ గెలుపే ఏకైక ప్రామాణికంగా భావిస్తున్న అధిష్టానం.. ఓసీ, బీసీ కాంబినేషన్‌తో పాటు సంస్థాగత ఓటు బ్యాంకు బలాన్ని కలగలిపి ఎన్నికల బరిలోకి దిగాలనే పట్టుదలతో ఉందని సమాచారం.
ఈ నెల 24న బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సల్, సహ ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్, రేఖా శర్మల సమక్షంలో కీలక సమావేశం జరగనుంది. కమిటీల నివేదికలను పరిశీలించి షార్ట్‌లిస్ట్ చేసిన 3 నుంచి 4 పేర్లను కేంద్ర నాయకత్వానికి పంపనున్నారు. సామాజిక లెక్కలతో కాషాయ పెద్దలు వేసిన ఈ ఎత్తుగడ ఏ మేరకు ఫలిస్తుందో అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత రానుంది.


