తెలంగాణ

brs: కారులో గ్రూపు రాజకీయాలు.. కేటీఆర్ క్లాసులు పనిచేస్తాయా?

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

brs: గులాబీ గూటిలో ఎప్పటినుంచో సాగుతున్న వర్గపోరు, అంతర్గత కుమ్ములాటలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టిగానే నడుం బిగించారు. ఒకే పార్టీలో ఉంటూ పక్క నియోజకవర్గంలో సొంత పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు తెరవెనుక గోతులు తవ్వే పద్ధతికి ఇక కాలం చెల్లిందని నేతలకు తేల్చి చెబుతున్నారు.

brs: గులాబీ గూటిలో ఎప్పటినుంచో సాగుతున్న వర్గపోరు, అంతర్గత కుమ్ములాటలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టిగానే నడుం బిగించారు. ఒకే పార్టీలో ఉంటూ పక్క నియోజకవర్గంలో సొంత పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు తెరవెనుక గోతులు తవ్వే పద్ధతికి ఇక కాలం చెల్లిందని నేతలకు తేల్చి చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు పెట్టిన క్లాస్ పార్టీ శ్రేణుల్లో కాస్త చలనం తీసుకురావడంతో, అదే ఫార్ములాను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఏళ్ల తరబడి వేళ్లూనుకుపోయిన గ్రూపు తగాదాలను కేటీఆర్ ఇచ్చే వార్నింగ్‌లు ఎంతవరకు కట్టడి చేస్తాయన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

వరంగల్ వేదికగా మొదలైన రివ్యూ

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో నిర్వహించిన భేటీలో కేటీఆర్ కాస్త ఘాటుగానే స్పందించారు. ఓట్ల నమోదు విషయంలో కొందరు నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, సీనియర్లు చూపిస్తున్న నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల మధ్య సయోధ్య లేకపోవడం, ఒకరి కాళ్లు ఒకరు లాక్కోవడం వల్లే గెలవాల్సిన సీట్లను చేజేతులా పోగొట్టుకున్నామని కుండబద్దలు కొట్టారు. ఎవరు ఎవరిని ఓడించడానికి కోవర్టు పనులు చేశారో తన దగ్గర పూర్తి చిట్టా ఉందని హెచ్చరిస్తూ, నేతల గుట్టు విప్పినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మిగతా జిల్లాల్లోనూ ఇదే వరుస

వరంగల్ సమీక్ష ఇచ్చిన జోష్‌తో, రాష్ట్రంలోని మిగతా జిల్లాల నేతలను కూడా పిలిపించి ఇలాగే క్లాస్ పీకాలని తెలంగాణ భవన్ నిర్ణయించిందట. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను భవిష్యత్ ఎన్నికలకు పరీక్షగా భావిస్తున్న గులాబీ నాయకులు, ముందస్తుగానే నేతలను లైన్‌లో పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ఆరు ఉమ్మడి జిల్లాల నేతలతో ముందుగా సమావేశాలు పూర్తి చేసి, ఆ తర్వాత మిగిలిన నాలుగు జిల్లాల ముఖ్యులతో కేటీఆర్ స్వయంగా వన్-టు-వన్ మాట్లాడనున్నారని సమాచారం.

హెచ్చరికలు సరే.. గ్రూపులు ఆగుతాయా?

కలిసి పనిచేసే వారికే భవిష్యత్తులో పార్టీ పదవులు, ఎన్నికల టికెట్లు దక్కుతాయని, సొంత పార్టీలోనే కుట్రలు చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదని అధిష్టానం కరాఖండీగా చెబుతోంది. "నేను గెలవాలి.. నా పక్క నియోజకవర్గంలో నా పార్టీ మనిషే ఓడిపోవాలి" అనే స్వార్థమే గత ఎన్నికల్లో అధికారాన్ని దూరం చేసిందని కేటీఆర్ గట్టిగానే గుర్తు చేస్తున్నారు. చిన్న నేతైనా, పెద్ద నేతైనా గ్రూపులు కడితే వేటు తప్పదని హెచ్చరిస్తున్నారు. అయితే, నాయకుల మధ్య ఉన్న పాత పగలు, ఆధిపత్య పోరు కేవలం ఇలాంటి సమీక్షలతో సమసిపోతాయా? కేటీఆర్ ఇచ్చే 'ఉతుకుడు' క్లాసులు గ్రూపు రాజకీయాలను ఆపి కారు పార్టీని గాడిన పెడతాయా? అన్నది వేచి చూడాల్సిందే.

#BRS#Bharat Rashtra Samithi#BRS Party#Telangana BRS#BRS News#BRS Latest News#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి