తెలంగాణ

జాగ్రత్త.. డిసెంబర్ 15నుండి నీటి కష్టాలు..! కాలనీలు, బస్తీలలో మొబైల్ మైక్‌ల ద్వారా ప్రచారం

రచన: NK•••5 నిమిషాల పఠనం

ఎల్ నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎల్ నినో కరోనా లాంటి విపత్తు అని.. ముందు ముందు రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు రాబోతున్నాయని హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్.

Save Water: ఎల్ నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎల్ నినో కరోనా లాంటి విపత్తు అని.. ముందు ముందు రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు రాబోతున్నాయని హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్. సాగునీటి సంగతి దేవుడెరుగు.. తాగేందుకు కూడా చుక్క నీరు దొరకని పరిస్థితి రాబోతోందన్నారు. ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ క్రమంలో నీటిని, విద్యుత్ ను అత్యంత పొదుపుగా వాడుకోవాలని రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.

నీరు, విద్యుత్ పొదుపుగా వాడుకోవాలి

అంతేకాదు ప్రజల భాగస్వామ్యం లేకుండా ఎల్ నినో విపత్తును ఎదుర్కోవడం అసాధ్యం అని తేల్చి చెప్పారు. నీటిని, విద్యుత్ ను పొదుపు చేయడంలో ప్రజలంతా సహకరించాలని పదే పదే కోరారు. ఇక నీరు, విద్యుత్ పొదుపు చేసే విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్. ఎల్ నినో ప్రభావం, నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.

డిసెంబర్ 15 నుండి నీటి కటకట..

సీఎం రేవంత్ ఆదేశాలతో జలమండలి అధికారులు అలర్ట్ అయ్యారు. నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు నగరంలోని కాలనీల, బస్తీలలో మొబైల్ మైకుల ద్వారా ప్రచారం షురూ చేశారు. డిసెంబర్ 15 నుండి నీటి కష్టాలు మొదలవుతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సింగూరు, మంజీరా రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయని.. నీటిని సాధ్యమైనంత పొదుపుగా వాడుకోవాలని మొబైల్ మైకుల ద్వారా కోరుతున్నారు. నీటిని వృథా చేయకుండా అత్యంత పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నల్లా నీటితో కానీ బోర్ వెల్ నీరుతో కానీ కార్లు కడిగినా, రోడ్లు తడిపినా భారీగా జరిమానాలు విధిస్తామని, బోర్ మోటార్లు కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు. మొబైల్ మైక్ ద్వారా చేస్తున్న ప్రచారానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కార్లు కడిగినా రోడ్లు తడిపినా భారీ జరిమానా, బోర్ మోటర్ సీజ్

''సింగూరు, మంజీరా జలశయాలు అడుగంటాయి. డెడ్ స్టోరేజ్ కు చేరుకుంటున్నాయి. 2026 డిసెంబర్ 15 తర్వాత నీటి సరఫరా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. డిసెంబర్ మధ్య నుండి నీటికి కటకట తప్పదు. ఎల్ నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు కూడా పడిపోతున్నాయి. కావున సెల్లార్లు, రోడ్డు, కార్లు కడిగేందుకు నల్లా నీరు లేదా బోరు నీళ్లు వృథా చేయొద్దు. ఇటువంటి ఉల్లంఘనలను ప్రభుత్వం, జలమండలి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. నీటిని వృథా చేస్తే భారీ జరిమానాలు విధించడంతో పాటు బోర్ వెల్ మోటార్లు సీజ్ చేస్తారు. ప్రతి నీటి చుక్కను పొదుపు చేద్దాం. అందరి ప్రయోజనం కోసం నీటిని బాధ్యతగా వినియోగిస్తూ సహకరించండి'' అని మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

#Save Water#Mobile Mike Campaign#Hyderabad#Telangana#Elnino#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి