TG : కూరగాయలు, నూనెల రేట్లు పెరిగితేనే సర్దుకుపోయే సామాన్యుడికి, ఇప్పుడు రోజూ తినే నాలుగు మెతుకులు కూడా గొంతులో పచ్చివెలక్కాయలా మారుతున్నాయి. తెలంగాణలో సన్న బియ్యం ధరలు గతంలో ఎన్నడూ లేని రీతిలో భగ్గుమంటూ పేద, మధ్యతరగతి వర్గాల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. కేవలం కొద్ది నెలల క్రితం వరకు రూ. 50 నుంచి రూ. 55 మధ్య లభించిన సన్నాలు, ఇప్పుడు అమాంతం పెరిగి ప్రాంతాన్ని బట్టి కిలో ఏకంగా రూ. 65 నుంచి రూ. 90 దాకా పలుకుతున్నాయి. పండుగల సీజన్ ముంగిట ప్రధాన ఆహారమైన బియ్యం రేట్లు ఇలా ఆకాశాన్నంటుతుండటం గృహిణుల నెలవారీ బడ్జెట్‌ను పూర్తిగా తలకిందులు చేస్తోంది.
మార్కెట్ వర్గాల లెక్కల ప్రకారం చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. బీపీటీ, హెచ్ఎంటీ, సోనా మసూరి, జై శ్రీరామ్ లాంటి సన్న రకాల బియ్యం ధరలు కొండెక్కడంతో, 25 కిలోల బస్తా కొనాలంటే సామాన్యులు అదనంగా రూ. 300 నుంచి రూ. 500 వరకు జేబులోంచి తీయాల్సి వస్తోంది. కొన్ని ప్రీమియం రకాలకైతే ఈ భారం మరింత ఎక్కువగానే ఉంటోంది. నెలకు సగటున 25 నుంచి 30 కిలోల బియ్యం వాడే సాధారణ కుటుంబం.. ఒక్క బియ్యం కోసమే అదనంగా రూ. 500 పైనే కేటాయించాల్సి రావడంతో ఎలా నెట్టుకురావాలో పాలుపోవడం లేదు.
ఈ ధరల మంట వెనుక విస్తుపోయే కారణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో పండే నాణ్యమైన సన్నాలకు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక లాంటి పొరుగు రాష్ట్రాల నుంచి భారీ డిమాండ్ ఏర్పడింది. అక్కడి వ్యాపారులు ఎక్కువ ధర పెట్టి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో స్థానికంగా నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. దీనికితోడు వాతావరణ మార్పుల వల్ల రాబోయే సీజన్లలో దిగుబడి తగ్గుతుందన్న భయాలు వ్యాపారుల్లో మొదలయ్యాయి. వీటన్నింటికీ మించి, ప్రభుత్వం సన్న వడ్లకు ప్రకటించిన రూ. 500 బోనస్‌ను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు నేరుగా రైతుల వద్ద నుంచే ధాన్యాన్ని పోటీపడి కొనుగోలు చేసి గోదాముల్లో దాచిపెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కావాలనే కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ లాభాలు దండుకునే ప్రయత్నాలు సాగుతున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
కూరగాయలు, నూనెలు, పప్పుల ధరలు ఇప్పటికే చుక్కలు చూపిస్తుంటే.. ఇప్పుడు నిత్యం ఆకలి తీర్చే అన్నం కూడా ఇంత భారమైతే ఎలా బతకాలని జనం ప్రశ్నిస్తున్నారు. పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ యంత్రాంగం ఇప్పటికైనా రంగంలోకి దిగి గోదాముల్లోని అక్రమ నిల్వలపై నిఘా పెంచాలని కోరుతున్నారు. కృత్రిమ కొరతను అరికట్టి ధరలను అదుపులోకి తీసుకురాకపోతే, సాధారణ కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


