మీథేన్ గ్యాస్ విడుదలలో జవహర్ నగర్ డంప్ యార్డ్ ప్రపంచ రికార్డ్
ప్రపంచంలోనే 4వ అతిపెద్ద డంప్ యార్డ్
మీథేన్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు
చెత్త నిర్వహణపై అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం
అయినా ప్రభుత్వం వినియోగించడం లేదని ఆగ్రహం
డంప్ యార్డుకి వ్యతిరేకంగా 23న బాధితులతో జవహర్‌నగర్‌లో ఈటల సమావేశం
25న మేధావులు, పర్యావరణవేత్తలతో డంప్ యార్డు ఏరియాలోనే రౌండ్ టేబుల్ సమావేశం
27 నుండి డంప్ యార్డుకి వ్యతిరేకంగా పాదయాత్ర
Eatala Rajender: జవహర్ నగర్ డంప్ యార్డ్ విషయంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డంప్ యార్డ్ తరలించాలనే డిమాండ్ తో ఆయన పాదయాత్ర చేయనున్నారు. డంప్ యార్డ్ వల్ల చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందన్న ఈటల.. ప్రభుత్వం వెంటనే స్పందించి డంప్ యార్డును అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా.. జవహర్ నగర్ బాధితులు, పర్యావరణ పరిరక్షణ కోసం భారీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 23న జవహర్ నగర్ బాధితులతో స్థానికంగా సమావేశం కానున్నారు. 25న మేధావులు, పర్యావరణవేత్తలతో డంప్ యార్డు ఏరియాలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఇక డంప్ యార్డుని తరలించాలనే డిమాండ్ తో 27 నుంచి పాదయాత్ర చేయనున్నారు.
ప్రపంచాన్ని గడగడలాగిస్తున్న మీథేన్ గ్యాస్ కాలుష్యంలో జవహర్ నగర్ డంప్ యార్డు ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలవడం అత్యంత ఆందోళనకరమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కేవలం 2 లక్షల జనాభా కోసం ఏర్పాటు చేసిన ఈ డంప్ యార్డుకు, నేడు కోటి 60 లక్షల మందికి పైగా జనాభా ఉన్న మహానగర చెత్త అంతా వచ్చిపడుతోందని తెలిపారు. దీనివల్ల చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. చుట్టూ 25 కిలోమీటర్ల రేడియస్ లో భూగర్భ జలాలు విషతుల్యం అయ్యాయని వాపోయారు. 30 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న ప్రజలకు విషపు గాలులతో ఊపిరితిత్తుల సమస్యలు, చర్మ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కూరగాయలు అమ్ముకొని, ఇళ్లలో పని చేసుకుని కడు బీదరికంలో ఉన్న వారు సంపాదించుకునే ప్రతి పైసా వైద్యం కోసం ఖర్చు పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జనావాసాలకు దూరంగా డంపింగ్ యార్డు తరలించాలని అనేక సంవత్సరాలుగా ఉద్యమం నడుస్తోందన్నారు. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా చెత్త వల్ల ఇన్ని సమస్యలు ఎదుర్కొనే దుర్మార్గమైన పరిస్థితికి చరమగీతం పాడకపోవడం బాధాకరమన్నారు. ఐఐటీ బాంబే.. ఇలాంటి చెత్త డంప్ యార్డుల నిర్వహణ కోసం టెక్నాలజీ కూడా అందించిందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగల్భాలు పక్కనపెట్టి ఈ సమస్య నుంచి ఇక్కడి ప్రజలకు శాశ్వత పరిష్కారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్.
అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు తప్ప సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా దీని మీద రీసెర్చ్ చేశారని తెలిపారు. ఇది ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద డంపింగ్ యార్డ్ అని, ఎక్కువ విష పదార్థాలను విడుదల చేస్తున్న డంపింగ్ యార్డ్ ఇదేనని అన్నారు. వెంటనే తగు చర్యలు తీసుకోకపోతే ఇక్కడ నివసించే ప్రజలకు మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు దిక్కులా చెత్తను తరలించి జవహర్ నగర్ డంప్ యార్డుకు రాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్.
''గ్లోబల్ వార్మింగ్ కి, వాతావరణ మార్పులకు కారణమైన ముఖ్యమైన వాటిలో మీథేన్ గ్యాస్ ఒకటి. మీథేన్ గ్యాస్ కాలుష్యం తగ్గించడం ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్. ఉపగ్రహాల సాయంతో ప్రపంచంలో మీథేన్ కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించారు. 18 దేశాల్లో మొదటి 25 స్థానాల్లో ఉన్న ప్రాంతాలను UCLA లా స్కూల్ (యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్) ప్రకటించింది. ఈ రిపోర్ట్ ప్రకారం నాలుగవ స్థానంలో జవహర్ నగర్ డంప్ యార్డు ఉంది. అర్జెంటీనా దేశ రాజధాని బ్యూనస్ ఐరిష్ మొదటి స్థానం, ఇండోనేషియా దేశ రాజధాని జకార్తా రెండవ స్థానంలో, మలేషియా రాజధాని కౌలాలంపూర్ మూడవ స్థానంలో ఉండగా.. జవహర్ నగర్ డంప్ యార్డు నాలుగవ స్థానంలో నిలిచింది'' అని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఎంపీ ఈటల రాజేందర్ కు వివరించారు.


