ప్రకృతి వైపరీత్యాలపై రాజకీయాలు చేయొద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) ప్రతిపక్షాలకు హితవు పలికారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో (El Nino) ప్రభావంతో రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత పెరిగి వర్షపాతం తగ్గే ముప్పు ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి నీటి ఎద్దడి, తాగునీటి కొరత తలెత్తకుండా సమర్థవంతమైన ప్రణాళికలు అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
నీటి వనరుల సంక్షణకు కీలక నిర్ణయం
నీటి వనరుల సంరక్షణకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని రామప్ప చెరువు, దాని పరిధిలోని డీఫ్లోరైడేషన్ ప్రాజెక్టును మంత్రి సీతక్క స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం రామప్ప చెరువులో 29 అడుగుల నీటి నిల్వలు ఉన్నాయని, గోదావరి నుంచి నీటిని పంపింగ్ చేసి చెరువులు నింపే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ చెరువు ద్వారా శుద్ధి చేసిన తాగునీటిని ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, మల్లంపల్లితో పాటు భూపాలపల్లి జిల్లాలోని పలు గ్రామాలకు నిరంతరాయంగా అందించేలా చర్యలు వేగవంతం చేశామని వెల్లడించారు.
ఈ క్రమంలో ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటికుంటలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, పూడికతీత పనులు, బోర్‌వెల్ రీఛార్జ్ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరగడమే కాకుండా, గ్రామీణ ప్రాంత కూలీలకు పుష్కలంగా పని లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో నీటి సరఫరా పరిస్థితులపై ప్రతిరోజూ ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.
అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాజకీయాలు చేయడం మానుకోవాలని, ప్రత్యామ్నాయంగా రామప్ప-లక్నవరం కాలువ ప్రాజెక్టు వంటి ప్రతిపాదిత పనులను వేగవంతం చేస్తున్నామని సీతక్క చెప్పారు. ఎల్‌నినో ముప్పును ఎదుర్కొనేందుకు ప్రజలందరూ భాగస్వాములై, ప్రతి నీటి చుక్కనూ పొదుపుగా వాడుకోవాలని, సర్పంచులు, గ్రామస్తులు నీటి సంరక్షణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు.


