తెలంగాణ

MLC Elections : కాంగ్రెస్ - సీపీఐ దోస్తీకి ఎమ్మెల్సీ చిచ్చు!

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే పాత నానుడి తెలంగాణ రాజకీయ వేదికపై మరోసారి ప్రత్యక్షమైంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చేతికి చేయి కలిపి, కాంగ్రెస్ విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన అసలైన మిత్రపక్షం సీపీఐని పక్కనబెట్టి.. ఎన్నికల్లో తమతో కత్తులు దూసిన ప్రత్యర్థుల గడపను అధికార పార్టీ తొక్కడం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

MLC Elections: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే పాత నానుడి తెలంగాణ రాజకీయ వేదికపై మరోసారి ప్రత్యక్షమైంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చేతికి చేయి కలిపి, కాంగ్రెస్ విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన అసలైన మిత్రపక్షం సీపీఐని పక్కనబెట్టి.. ఎన్నికల్లో తమతో కత్తులు దూసిన ప్రత్యర్థుల గడపను అధికార పార్టీ తొక్కడం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. త్వరలో జరగబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా జెండా పాతాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో వ్యూహాలు రచిస్తుండగా, క్షేత్రస్థాయిలో వామపక్షాల మద్దతు కూడగట్టే క్రమంలో గాంధీభవన్ వేస్తున్న అడుగులు విమర్శలకు తావిస్తున్నాయి. ఎన్నికల్లో తమతో పోటీపడిన సీపీఎం రాష్ట్ర కార్యాలయం (ఎంబీ భవన్) వద్దకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా వెళ్లి మద్దతు కోరడం, అటు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌తోనూ చర్చలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని కలిసి నడిచిన మిత్రుడు సీపీఐని సంప్రదించకుండా మొండిచేయి చూపించడం వెనుక అసలు ఆంతర్యమేంటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

నిజానికి కాంగ్రెస్, సీపీఐ బంధం మధ్య బీటలు వారడానికి ఇటీవల జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా ఆర్టీసీలో తిరుగులేని పట్టున్న సీపీఐ అనుబంధ కార్మిక సంఘాన్ని దెబ్బకొట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ తన సొంత అనుబంధ విభాగాన్ని బరిలోకి దించి మిత్రద్రోహానికి తెరలేపింది. కానీ కార్మికులు మాత్రం మిత్రపక్షాన్ని కాదని కాంగ్రెస్‌కు ఊహించని షాకిస్తూ సీపీఐ సంఘానికే పట్టం కట్టారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ వ్యవహారశైలిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్ర అసహనం, అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ గ్యాప్‌ను పూడ్చాల్సింది పోయి, ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పెద్దలు సీపీఐని లైట్ తీసుకోవడం కామ్రేడ్లకు మరింత ఆగ్రహం తెప్పిస్తోందట.

మిత్రపక్షం చులకనగా చూస్తోందన్న భావనతో ఉన్న సీపీఐ నాయకత్వం ఇప్పుడు "మనదాకా వచ్చేంత వరకు చూద్దాం" అనే ధోరణి వీడి, ఎమ్మెల్సీ బరిలో ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సీపీఐ గనక పట్టభద్రుల బరిలో సొంత అభ్యర్థిని నిలబెడితే, వామపక్ష ఓటు బ్యాంకు చీలిపోయి అంతిమంగా అధికార కాంగ్రెస్‌కే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవైపు అధికార యంత్రాంగం ఓటర్ల నమోదు ప్రక్రియను ముమ్మరం చేస్తూ గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్న తరుణంలో, మిత్రుడిని బుజ్జగించి దోస్తీని కాపాడుకుంటుందా లేక పంతాలకు పోయి చేజేతులా చేదు ఫలితాలను కొనితెచ్చుకుంటుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

#Telangana MLC Elections#MLC Elections#Graduate MLC Elections#Telangana Politics#Telangana Congress#Congress Party#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి