FSSAI Raid : రంగురంగుల ప్యాకెట్లలో మెరుస్తూ, కొరకగానే కరకరలాడే చప్పుడుతో పిల్లల నాలుకను ఊరించే ఆ చిరుతిళ్లు అమృతం కావు... నిలువెల్లా విషం అని అంటున్నారు అధికారులు. రూపాయి, రెండు రూపాయలకే ప్యాకెట్ నిండా దొరుకుతున్నాయి కదా అని పిల్లల చేతుల్లో పెడుతున్న ఆ స్నాక్స్, వాళ్ల పసి ప్రేవులను నిశ్శబ్దంగా కుళ్లబెడుతున్నాయని తెలిస్తే ఏ తల్లిదండ్రుల గుండెలైనా బద్దలవ్వాల్సిందే. కాసుల కోసం కళ్లుమూసుకున్న కల్తీ ముఠాలు చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతూ సాగిస్తున్న విష దందా హైదరాబాద్ వేదికగా రట్టయింది. కాటేదాన్ సమీపంలోని ప్రేమావతిపేటలో రూల్స్‌ని తుంగలో తొక్కి సాగుతున్న సాహిల్ ఫుడ్స్‌కు చెందిన నాలుగు తయారీ కేంద్రాలపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేయడంతో ఈ వికృత రూపం బయటపడింది.
తనిఖీ బృందాలు లోపలికి అడుగుపెట్టినప్పుడు కనిపించిన దృశ్యాలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి. అక్కడ స్నాక్స్ తయారవుతున్నాయా లేక విషాన్ని దట్టించి ప్యాక్ చేస్తున్నారా అన్నంత దారుణంగా ఆ ప్రాంగణాలు ఉన్నాయి. గాలి, వెలుతురు ఏమాత్రం సోకని చీకటి గదులు, చుట్టూ పేరుకుపోయిన మురికి వ్యర్థాలు, పక్కనే వెదజల్లుతున్న భరించలేని దుర్వాసనల మధ్య ఆ చిరుతిళ్లు తయారు అవుతున్నాయి. పరిశుభ్రతకు పాతరేస్తూ, అక్కడ పనిచేసే కార్మికులు నోట్లో పాన్ మసాలాలు, గుట్కాలు నములుతూనే ఆహారాన్ని తయారు చేస్తున్నారు. పిల్లలు తినే ఆ స్నాక్స్‌ను కనీసం పాత్రల్లో కాకుండా మురికి నేలపైనే గుట్టలుగా పోసి ఉంచారు. ఇంకా ఘోరమైన విషయమేమిటంటే, ఆకర్షణీయమైన రంగుల కోసం నిషేధిత సింథటిక్ కెమికల్స్‌ను అపరిశుభ్ర బకెట్లలో కలిపి నేరుగా ఆ ఆహార పదార్థాలపై కుమ్మరిస్తున్నారు.
ఈ దాడిలో అధికారులు ఏకంగా 55 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరి అనుమతులు లేని, కనీసం తయారీ వివరాలు కూడా లేని ఈ కాలకూట విషం విలువ మార్కెట్లో దాదాపు రూ. 34 లక్షల పైమాటేనని అంచనా. ఆహార భద్రతా ప్రమాణాలను నిలువునా తొక్కిన ఆ నాలుగు యూనిట్లకు చెందిన FSSAI లైసెన్సులను అధికారులు వెనువెంటనే రద్దు చేసి, తయారీని పూర్తిగా స్తంభింపజేశారు. ల్యాబ్ నివేదికలు రాగానే నిందితులపై క్రిమినల్ కేసులు ఫైల్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కల్తీ రాయుళ్లు జైలుపాలవుతారేమో కానీ, చౌకగా వస్తున్నాయని మనం తెచ్చిపెట్టే ఇలాంటి రంగుల విషం మన పసిపిల్లల భవిష్యత్తును కబళించకముందే తల్లిదండ్రులు మేల్కోవాలి. ప్యాకెట్‌పై సరైన గుర్తింపు, నాణ్యతా ప్రమాణాలు లేని తినుబండారాలను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించాలని అధికారులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.


