Double Salary Scam: నెల తిరిగేసరికి ఒక్క కొలువు చేసి సంపాదించుకున్న జీతం అందుకోవడానికే సగటు ఉద్యోగి ట్రెజరీ వైపు ఆశగా ఎదురుచూసే రోజులివి. అలాంటిది ఎలాంటి జంకూ గొంకూ లేకుండా, సర్కారు ఖజానానే గుల్ల చేస్తూ ఏకంగా రెండేసి జీతాలు లాగేస్తున్న దొంగ ఉద్యోగుల ముఠా గుట్టు తెలంగాణలో రట్టయింది. ఒకే ఆధార్ కార్డును రెండు వేర్వేరు శాఖల్లో జతచేసి, ఏళ్ల తరబడి రెండు చేతులా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న వైనం సెక్రటేరియట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఉద్యోగుల డేటాను పక్కాగా ఆన్‌లైన్ చేసి ఆధార్‌తో లింక్ చేసే క్రమంలో ప్రభుత్వం నియమించిన అహ్మద్ నదీం కమిటీ పరిశీలనలో ఏకంగా 3,900 మంది ఉద్యోగులు ఈ రకంగా డబుల్ శాలరీలు గుంజుతున్నట్లు తేలడంతో అధికారులు నివ్వెరపోయారు.
ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ట్విస్ట్ ఏమిటంటే.. ప్రభుత్వానికి అనుమానం వచ్చి ఈ 3,900 మందికి గత జూన్ నెల నుంచే జీతాల చెల్లింపులను పూర్తిగా నిలిపివేసింది. సాధారణంగా ఏ చిన్న ఉద్యోగికైనా ఒకటో తారీఖున వేతనం అకౌంట్లో పడకపోతేనే ఆందోళనతో డ్రాయింగ్ అధికారుల చుట్టూ, ట్రెజరీల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతారు. కానీ, ఇక్కడ విచిత్రంగా నెలల తరబడి జీతం ఆగిపోయినా ఒక్కరంటే ఒక్కరు కూడా "మా శాలరీ ఎందుకు రాలేదు?" అంటూ డిపార్ట్‌మెంట్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తాము ప్రశ్నిస్తే ఎక్కడ అసలు బండారం బయటపడుతుందోనన్న భయంతోనే వాళ్లు ముఖం చాటేశారా, లేక అసలు ఉనికిలోనే లేని అదృశ్య ఉద్యోగుల పేర్లతో కొందరు పెద్దలే ఈ తతంగం నడిపిస్తున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ఇంతటితో ఆగకుండా, ఈ దందాలో అత్యంత అమానవీయమైన కోణం పోలీస్ శాఖ కేంద్రంగా వెలుగుచూసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన దాదాపు 600 మంది పోలీసుల వివరాలు కూడా ఈ జాబితాలో ప్రత్యక్షమవ్వడం యావత్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. అమరులైన సిబ్బంది మరణాల వివరాలను సర్వీస్ రికార్డుల్లోనూ, ట్రెజరీ డేటాబేస్‌లోనూ సకాలంలో అప్‌డేట్ చేయకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, చనిపోయిన వారి పేర్ల మీదా నిస్సిగ్గుగా జీతాలు డ్రా చేసేశారు. ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది? విధుల్లో లేని వ్యక్తుల పేరిట వేతనాలు డ్రా అవుతుంటే శాఖాధిపతులు ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు విచారణలో కీలకంగా మారాయి.
కొన్నిచోట్ల సాంకేతిక లోపాలు, బదిలీల నమోదులో జరిగిన లేట్ కారణమైనప్పటికీ, ఉద్దేశపూర్వకంగా ప్రజాధనాన్ని లూటీ చేసిన వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. అక్రమంగా దండుకున్న ప్రతీ పైసాను రికవరీ చేయడంతో పాటు, వీరికి సహకరించిన అధికారులపైనా క్రిమినల్ కేసులు బనాయించేందుకు రెడీ అవుతుంది. అహ్మద్ నదీం కమిటీ ఫైనల్ రిపోర్ట్‌ని సమర్పించగానే ఈ దొంగ జీతాల రాబందుల భవిష్యత్తు తేలనుంది. కేవలం ఆధార్ లింకింగ్‌తోనే సరిపెట్టకుండా ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లు, హాజరు, బ్యాంకు ఖాతాలను పూర్తిస్థాయిలో అనుసంధానించకపోతే ఇలాంటి ఖజానా లీకేజీలను అడ్డుకోవడం అసాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది.


