TG: తెలంగాణలో ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన అవినీతి అధికారులను సచివాలయం వెనకేసుకొస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండేళ్లలో ఏసీబీ ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరిన 22 కేసుల్లో ప్రభుత్వం అనుమతి నిరాకరించడమే కాకుండా, ఆ కేసులను ఉపసంహరించుకోవాలని దర్యాప్తు సంస్థను ఆదేశించినట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం. పద్మనాభరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (సీఎస్) లేఖ రాశారు.
రాష్ట్రంలో ప్రతి నెలా సగటున 20 నుంచి 25 లంచం కేసులు నమోదవుతున్నప్పటికీ, సచివాలయంలోని కొందరు పెద్దలు విచారణ నివేదికలను ప్రభావితం చేస్తూ ఫైళ్లను ఏళ్ల తరబడి తొక్కిపెడుతున్నారని పద్మనాభరెడ్డి ఆరోపించారు. చివరకు వాటిని కోర్టులకు వెళ్లకుండా కేవలం శాఖాపరమైన విచారణలకే పరిమితం చేస్తూ ముగించేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇటీవల 'తేజారామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్' కేసులో ఇచ్చిన తీర్పును ఆయన ప్రస్తావించారు. లంచం అడగడం లేదా తీసుకోవడం నేరపూరిత చర్యే తప్ప అధికారిక విధుల్లో భాగం కాదని, ట్రాప్ లేదా అక్రమాస్తుల కేసుల్లో చిక్కిన అధికారులపై విచారణ చేపట్టేందుకు ఏసీబీకి ఎలాంటి ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఈ తీర్పు నేపథ్యంలో, ప్రభుత్వ అనుమతి కోసం వేచి ఉండకుండా నిందితులపై ప్రాసిక్యూషన్ కొనసాగించేలా ఏసీబీకి ఆదేశాలు ఇవ్వాలని, సచివాలయంలో పెండింగ్‌లో ఉన్న కేసుల ఫైళ్లన్నింటినీ వెంటనే ఏసీబీకి తిరిగి పంపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.


