National

Bhagwant Mann: సీఎంకు ఎయిర్‌పోర్ట్‌లో ఫైన్.. ఆమ్‌ఆద్మీ పార్టీలో తీవ్ర కలకలం!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు (Bhagwant Mann) ఢిల్లీ విమానాశ్రయంలో తీవ్ర అవమానం జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సంచలన ఆరోపణలు చేసింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సీఎం మాన్‌ను సుమారు మూడు గంటల పాటు ఉద్దేశపూర్వకంగా నిర్బంధించి, ఆపై రూ.50వేల జరిమానా విధించారని ఆప్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

 ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు (Bhagwant Mann) ఢిల్లీ విమానాశ్రయంలో తీవ్ర అవమానం జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సంచలన ఆరోపణలు చేసింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సీఎం మాన్‌ను సుమారు మూడు గంటల పాటు ఉద్దేశపూర్వకంగా నిర్బంధించి, ఆపై రూ.50వేల జరిమానా విధించారని ఆప్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది.

 ఫ్రాన్స్‌లో జరిగిన అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివల్‌లో పంజాబ్ వ్యవసాయ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి వెళ్లిన సీఎంను కస్టమ్స్ అధికారులు లగేజీ తనిఖీల పేరుతో గంటల తరబడి వేచి చూసేలా చేశారని ఆప్ పంజాబ్ మీడియా ఇన్‌చార్జి బల్తేజ్ పన్ను తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే అధికారులు ఈ విధంగా ప్రవర్తించారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిరభ్యంతర పత్రం (NOC) రద్దును కోర్టు ద్వారా తోసిపుచ్చి మరీ సీఎం ఫ్రాన్స్ వెళ్లారని, ఆ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇబ్బందులకు గురిచేస్తోందని ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.

 అయితే, ఈ విమర్శలపై కస్టమ్స్ వర్గాలు భిన్నమైన కథనాన్ని వెల్లడించాయి. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన లగేజీలో తెచ్చిన కొన్ని పరిమితికి మించిన వస్తువులను ముందస్తుగా డిక్లేర్ (రూల్స్ ప్రకారం ప్రకటించకపోవడం) చేయనందువల్లే నిబంధనల ప్రకారం రూ. 50,000 జరిమానా విధించాల్సి వచ్చిందని కొన్ని వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఇతర ఉన్నతాధికారులు మాత్రం ఇది కేవలం సాధారణ విమానాశ్రయ తనిఖీ అని, సీఎం అధికారులకు పూర్తిగా సహకరించారని, తనిఖీల్లో ఎలాంటి అభ్యంతరకర వస్తువులు లభించలేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

 ఈ క్రమంలో పంజాబ్ విపక్ష పార్టీ శిరోమణి అకాలీదళ్ (SAD) నేత బిక్రమ్ సింగ్ మజిథియా సైతం ఈ వివాదంపై స్పందించారు. పరిమితికి మించి నగదు లేదా విలువైన వస్తువులను తీసుకువచ్చారన్న పక్కా సమాచారంతోనే సీఎం, ఆయన భార్యను కస్టమ్స్ అధికారులు ప్రశ్నించినట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఈ విమానాశ్రయ కస్టమ్స్ తనిఖీల ఘటనతో కేంద్ర ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య రాజకీయ వేడి మరోసారి గరిష్ఠ స్థాయికి చేరింది.

 

 

#BhagwantMannFine#DelhiAirportCustoms#BhagwantMannFranceVisit#AAPVsCenter#CustomsFine50K#PunjabPolitics2026#NationalNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి