ఏపీ లోకల్ బాడీ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. నామినేషన్ ప్రక్రియ సమయంలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య వివాదం రాజుకుంది.ఈ క్రమంలోనే పలు మున్సిపాలిటీల పరిధిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మున్సిపాలిటీలకు నామినేషన్ల గడువు ఇప్పటికే ముగియగా.. తాజాగా సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న మొత్తం 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచాలని ఆదేశించింది. దీనికి తోడు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల గడువుపై ఇవాళే నిర్ణయం తీసుకోవాలన్న న్యాయస్థానం.. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు నామినేషన్లు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 25 వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించవద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది.
ఎస్ఈసీ అత్యవసర భేటీ..
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్ఈసీ అత్యవసరంగా సమావేశమైంది. 19 స్థానాల్లో ఎన్నికల నిర్వహణపై సమీక్ష చేపట్టింది. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా, సెక్రెటరీ మల్లికార్జున, ఐజీ రాజకుమారి సుప్రీం తీర్పు నేపథ్యంలో భేటీ అయ్యారు. 19 స్థానాల్లో జరిగిన ఘటనలు, కేసుల అంశంపై ఎస్ఈసీ చర్చ జరుపుతోంది.ముఖ్యంగా పిడుగురాళ్ల, గురజాల, దర్శి, పుంగనూరు, మైదుకూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, రాయచోటి, దాచేపల్లి, గుత్తి, కడప, రాజంపేట, పులివెందుల, బద్వేల్, తిరుపతి, పొద్దుటూరు, కనిగిరి, తాడిపత్రి, జమ్మలమడుగులో నామినేషన్లకు గడువు పెంచనున్నారు. కాగా, పిటిషనర్ అభ్యర్థనలను ఎస్ఈసీ పరిశీలన చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
వైసీపీ అభ్యర్థులకు భద్రత..
నామినేషన్లు వేసే అభ్యర్థులకు తగిన పోలీస్ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో పాటు జిల్లా కేంద్రంలో నామినేషన్లు వేసేందుకు రెండు రోజుల సమయం ఇచ్చింది. ఎన్నికల సందర్భంగా జరిగిన హింసకు తమ వద్ద ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని.. ఉత్తర్వుల అమలు నివేదికను వెంటనే పంపాలని ఎస్ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 27కు వాయిదా వేసింది. ‘పోలీసులు,అధికారులు అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. స్టేట్ ఈసీ గట్టి పర్యవేక్షణ చేయాలి. ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి.నామినేషన్లను అడ్డుకుంటే సుప్రీంకోర్టు చూస్తూ కూర్చోలేదు.న్యాయ సమీక్ష అధికారం కింద ఈసీకి తగిన ఆదేశాలు ఇస్తున్నాం’ అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది.


