తెలంగాణ

Telangana: స్మార్ట్ రేషన్ కార్డులపై రాజకీయం.. పంపిణీ నిలిపివేయాలని డిమాండ్!..

రచన: Venu•••5 నిమిషాల పఠనం

ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని.. వాటిని ఏ ఒక్క పార్టీ లేదా నాయకుడి వ్యక్తిగత ప్రచారంగా మార్చకూడదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల వ్యవహారం ప్రస్తుతం రాజకీయ వివాదానికి దారితీస్తోంది. ముఖ్యంగా పేదలకు అందాల్సిన స్మార్ట్ రేషన్ కార్డులపై ఇద్దరు ప్రముఖుల ఫొటోలు మాత్రమే ఉండటంపై రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కోసం అమలు చేసే ప్రభుత్వ పథకాలను అధికార పార్టీ రాజకీయ ప్రచారం కోసం వాడుకోవడం సిగ్గుచేటని విమర్శలు చేస్తున్నారు.

ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని.. వాటిని ఏ ఒక్క పార్టీ లేదా నాయకుడి వ్యక్తిగత ప్రచారంగా మార్చకూడదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక స్మార్ట్ రేషన్ కార్డుల' పంపిణీకి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

అలాగే రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కూడా ఈ సమయంలోనే కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే ఇక్కడే వివాదం నెలకొంది. ప్రజా ప్రభుత్వం విడుదల చేసిన స్మార్ట్ రేషన్ కార్డు మోడల్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కార్డుకు ఎడమవైపు ఉండగా.. కుడివైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను ముద్రించారు.

ఈ క్రమంలో కార్డులపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో లేకపోవడంపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. రేషన్ బియ్యం పంపిణీలో కేంద్రానిదే సింహభాగమని అలాంటప్పుడు ఎవని అయ్య జాగీరు అని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు మాత్రమే వేసుకుంటున్నారు? అంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పేదలకు ఉచిత రేషన్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వమే అందిస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం తమ ప్రచారం కోసం సీఎం, మంత్రి ఫోటోలు వేసుకోవడం హాస్యాస్పదమని ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. మరోవైపు ఎంపీ రఘునందన్ రావు కూడా ఈ అంశం పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రధాని మోడీ ఫోటో లేకుండా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చే 6 కిలోల బియ్యంలో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది. అలాంటప్పుడు మోడీ ఫోటో పెట్టకపోవడం కేంద్రాన్ని అవమానించడమే అని మండిపడ్డారు. నిరసనల నడుమ సంగారెడ్డి పంపిణీ సభలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దానికి బీజేపీని బాధ్యులను చేయవద్దని కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వివాదం ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీస్తుందోననే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

#Telangana#Politics#smart ration cards#congress#bjp#distribution stop
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి