తెలంగాణ

Hyderabad: రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా.. కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ కేబినెట్ !..

రచన: Venu••6 నిమిషాల పఠనం

తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు రూ.200 కోట్లతో ప్రత్యేక పథకానికి ఆమోదం తెలిపింది.

తెలంగాణలో ఆగస్టు 15 న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అన్ని జిల్లాల్లో కార్డుల పంపిణీకి కావల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది.

ఈ క్రమంలో హైదరాబాద్ లో కాలుష్యాన్ని అరికట్టి నగరాన్ని గ్రీన్ సిటీ గా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే రూ.200 కోట్లతో నగరంలో ప్రస్తుతం ఉన్న 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ అమలుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.1,50,000 సబ్సిడీ అందిచనున్నారు.

ఇందులో భాగంగా తమ పాత ఆటోకు ఈవి కిట్ అమర్చుకోవడానికి లేదా పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త ఈ-ఆటో కొనుగోలు చేయడానికి ఆటో డ్రైవర్లుకు ఈ సబ్సిడీ వర్తింపచేయాలని నిర్ణయించారు. మరోవైపు గత సంవత్సరం నిర్వహించినట్టు.. ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహించాలని నిర్ణయించిన కేబినెట్.. ఈ సదస్సులో ఫ్యూచర్ సిటీ ప్లాన్ ఆవిష్కరణ చేపట్టాడానికి సిద్దం అవుతుంది.

అలాగే డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా స్టార్టప్స్, కొత్త ఆవిష్కరణలతో భారీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు వానాకాలం పంటకు సంబంధించి ఏడు రకాల సన్న ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు రైతులకు రైతు వేదికలు, గ్రామ పంచాయతీల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే 7 రకాల సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించనున్నారు.

యాసంగిలో 81.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, కేంద్రం కేవలం 63.62 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకుంటుంది. మిగిలిన 17.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ వేలం ద్వారా విక్రయించేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఇటీవల మొక్కజొన్న వేలంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం రాబ‌ట్టుకున్న నేప‌థ్యంలో ఈ మిగులు ధాన్యానికి కూడా క్వింటాలుకు రూ.2389 బేసిక్ ప్రైస్ నిర్ణయించి..

అలాగే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోకి రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను తీసుకురావ‌డానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు సాంకేతిక విద్యా శాఖ ప‌రిధిలో ఉన్నాయి. వీటిని తెలంగాణ ఎడ్యుకేష‌న్ యాక్ట్ నుంచి తొల‌గించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ప్రస్తుతం పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న వీటన్నింటినీ ఇకపై శక్తి శాఖ పరిధిలోకి విలీనం చేసేందుకు తీర్మానించింది. అలాగే కొత్తగా మరో 7 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. దీంతో ఇప్పటివరకు మంజూరైన స్కూళ్ల సంఖ్య 86కి చేరింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.

మరోవైపు మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు ఫేజ్-2 పనుల కోసం రూ.2,100 కోట్ల అంచనా వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే గూడెం దొడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచడంతో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనానికి కన్సల్టెంట్‌ నియమకానికి ఆమోదం తెలిపింది. అదేవిధంగా నగరంలోని కాలుష్య కారక పరిశ్రమలను శివార్లకు తరలించే HILT పాలసీ దరఖాస్తుల గడువును అక్టోబర్ 31 వరకు పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

#Telangana Cabinet#state development#Decisions#CM Revanth Reddy#Auto Rickshaw#EV Subsidy#Young India Skills University#HILT Policy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి