Komatireddy Raj Gopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ మాత్రం తగ్గడం లేదు. సొంత పార్టీ నేతలు, ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీ నాయకులను, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్ర నేతల చెప్పుచేతల్లో ఉండొద్దని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్ల కోసం కాదు.. పేదల కోసం ప్రభుత్వం పని చేయాలని హితవు పలికారు.
బయటి నుంచి వచ్చి ఆధిపత్యం చేయొద్దు..
కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి ఆధిపత్యం ఉండొద్దని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజమైన కాంగ్రెస్ నేతలను అణచివేయొద్దని కోరారు. నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయాలన్నారు. అలాగే ఉద్యమకారులకు కాంగ్రెస్ లో గుర్తింపు ఉండాలని సూచించారు. అదే సమయంలో తాను కాంగ్రెస్ లోనే ఉంటానని, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పని చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని కూడా పేర్కొన్నారు. పైగా తాను ఎక్కడా కూడా పార్టీని కానీ, ప్రభుత్వాన్ని కూడా విమర్శించలేదని రాజగోపాల్ రెడ్డి అనడం గమనార్హం.
అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారంటే..
''కాంగ్రెస్ పార్టీలో బయటి నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం పెరిగిపోయి నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావం. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉంటున్న నాయకులకు, ఉద్యమకారులకు గౌరవం దక్కాలి. ఈ ప్రభుత్వంలో వాళ్లకు కూడా కొంత గౌరవం కల్పించాలి అనేది నా భావన. ఇప్పుడు కూడా సీమాంధ్ర పాలకుల, సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ కానీ, మన ప్రభుత్వం కానీ నడపొద్దు.
సీమాంధ్ర పెట్టుబడిదారుల కోసమో, కాంట్రాక్టర్ల కోసమో ప్రభుత్వం పని చేయొద్దు..
మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. అదే ప్రజల ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకుల చెప్పు చేతల్లో మన ప్రభుత్వం ఉండొద్దు. పేదరికంలో ఉన్న మన ప్రజలకు సేవ చేద్దాం. సీమాంధ్ర పెట్టుబడిదారుల కోసమో, కాంట్రాక్టర్ల కోసమో ఈ ప్రభుత్వం పని చేయొద్దు అనేది నా భావన. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రజల్లో బలహీన పడుతుందో అనే మంచి ఉద్దేశంతో, ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా నేను ఇలా మాట్లాడాను.
అవకాశాల కోసమే కాంగ్రెస్ లోకి..
కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే ఇవన్నీ జరుగుతాయి. బయటి నుంచి వచ్చి పదవుల్లో ఉన్న వాళ్లు నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం చేయొద్దు.
అణిచివేస్తామంటే ఊరుకునేది లేదు..
అవకాశం కోసం వాళ్లు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. అందులో తప్పు లేదు. కాంగ్రెస్ బలోపేతం అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్లనే అణిచివేస్తాము, అగౌరవ పరుస్తాము, అవమానిస్తాము అంటే అది మంచి పద్ధతి కాదు'' అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.


