Goerge Krish: సినిమా ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ ని ప్రకటించే దర్శకుడు ఒకప్పుడు పూరి జగన్నాధ్ ఉండేవాడు. ఇప్పుడున్న దర్శకుల్లో రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా సంక్రాంతికి పక్కా అని మాత్రం అనిల్ రావిపూడి వస్తున్నాడు. ఇదంతా ఫాంలో ఉన్న దర్శకుడు సత్తా మీద ఆధారపడి ఉంటుంది. కానీ, గత కొన్నేళ్ళుగా సినిమా కోసం ఎదురూచూస్తున్న శ్రీను వైట్లకి ఇది సాధ్యమవడం చూస్తే కాస్త ఆశ్చర్యపోవాల్సిందే.
శ్రీను వైట్ల, శర్వానంద్ కాంబినేషన్‌లో తాజాగా 'జార్జ్ క్రిష్' అనే సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. నేడు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైన ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. 2027, సంక్రాంతికి జనవరి 14న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు, ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి కావడం విశేషం.

శర్వానంద్ హీరోగా నటించిన 'నారి నారి నడుమ మురారి', 'బైకర్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం, సంపత్ నంది దర్శకత్వంలో చేస్తోన్న 'భోగి' తాజాగా భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్టుగా టీమ్ ప్రకటించింది. ఇదొక విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్. సంపత్ నంది మేకింగ్ నచ్చి మరో సినిమాను చేసేందుకు శర్వా ఒకే చెప్పాడట.
ఇక, శ్రీను వైట్ల.. ఆ మధ్య ఢీ 2 చేస్తున్నట్టుగా ప్రకటించాడు. మంచు విష్ణు హీరోగా మొదలైన ఈ సినిమా ఎందుకో తెలియదు గానీ ఆగిపోయింది. మళ్ళీ, ఇప్పుడు 'జార్జ్ క్రిష్' చిత్రాన్ని శర్వానంద్‌తో మొదలుపెట్టాడు. కేవలం 4 నెలల్లోనే సినిమాను రిలీజ్ చేయబోతుండటం చూస్తుంటే ఈ సినిమా పట్ల శ్రీను వైట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్థమవుతోంది. మొత్తానికి, ఇన్నేళ్ళ ఆలస్యం అయినా, శ్రీను వైట్ల సాలీడ్ కంబ్యాక్ అదిరిపోతుందనిపిస్తోంది.


